భారీ వర్షంతో జిల్లాలో మృత్యు ఘోష

Published: Tuesday August 31, 2021
మర్పల్లి మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందిన నవాజ్ రెడ్డి కుటుంబ సభ్యుల పాలిట వరద మరణశాసనం 
మోమిన్ పేట్ నవవధువు ప్రవళిక మృతి
పులుమామిడి గ్రామంలో వరద ఉధృతిని అంచనా వేయలేక చాకలి శ్రీనివాస్ మృతి
వికారాబాద్ బ్యూరో 30 ఆగస్ట్ ప్రజాపాలన : ఆదివారం సాయంత్రం నుండి యెడతెరిపిలేకుండా కురిసిన వానకు వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరే క్రమంలో వాగుల్లోని వరద ప్రవాహాన్ని అంచనా వేయకపోవడంతో మృత్యు ఘోష విలయతాండవం చేసింది. జిల్లాలోని రావులపల్లి, పులుమామిడి, తాండూర్ లలో వరద కారణంగా వాగులు వంకలు ఉప్పొంగి ఉధృతిగా ప్రవహించాయి. చీకటి పడతున్న సమయంలో వాగును ఎలాగైనా దాటాలనే నిర్ణయమే ప్రయాణీకుల పాలిట శాపంగా మారింది. మర్పల్లి మండలం తిమ్మాపూర్, రావులపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగు వరద ఉధృతిలో కారుకొట్టుకుపోయింది. రావులపల్లి గ్రామానికి చెందిన నవాజ్ రెడ్డి, మోమిన్ పేటకు చెందిన ప్రవళికతో ఈ నెల 26న వివాహం జరిగింది. పెళ్ళి కుమారుడు నవాజ్ రెడ్డి, పెళ్ళి కూతురు ప్రవళికలతో పాటు పెళ్ళి కుమారుని అక్కలు శ్వేత, రాధిక, మేనల్లుడు శశాంక్ రెడ్డి, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డిలు మోమిన్ పేట నుండి రావులపల్లికి బయలుదేరారు. తిమ్మాపూర్ గ్రామం నుండి రావులపల్లికి వచ్చే మార్గంలో వాగు దాటాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం నుండి యెడతెరిపిలేకుండా కురిసిన వాన కారణంగా వాగు వరద ప్రవాహం రోడ్డుకు సుమారు రెండు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్నదని స్థానికులు చెబుతున్నారు. కారు డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి వరద ప్రవాహాన్ని సరైన అంచనా వేయలేక వాగులో నుండి కారును డ్రైవ్ చేశాడు. వరద ఉధృతిని తట్టుకోలేని కారు వరదలో కొట్టుకపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కాపాడుకొనుటకు విఫల ప్రయత్నం చేశారు. వరదలో కొట్టుకొస్తున్న కారు అద్దాలు పగలడంతో పెళ్ళి కుమారుడు నవాజ్ రెడ్డి, పెళ్ళి కుమారుని అక్క రాధికలు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. మిగిలిన నలుగురు వరద ఉధృతిలో కొట్టుకొనిపోగా సోమవారం ఉదయం నవ వధువు ప్రవళిక, పెళ్ళి కుమారుని మరో అక్క శ్వేత మృత దేహాలు బయటపడ్డాయి. మరో ఇద్దరి మృత దేహాల కొరకు వేట కొనసాగిస్తున్నారు. నవాబ్ పేట్ మండల పరిధిలో గల పులుమామిడి గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ (40) గ్రామంలోని హనుమాన్ మందిర్ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు వరదలో పడి మృతి చెందాడు. కారు కొట్టుకుపోయిన ప్రాంతానికి 4 కిలోమీటర్లు కాలినడకన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జిల్లా ఎస్పి నారాయణ డిఎస్పి సంజీవ్ కుమార్ లతో కలిసి నడిచి అక్కడికి చేరుకున్ననారు. నవవధువు ప్రవళిక మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చటానికి ఏర్పాట్లు చేసి స్థానికుల సాయంతో 2 కిలో మీటర్లు స్వయంగా ఎమ్మెల్యే భుజం పై మోసుకుంటూ ఒడ్డుకు చేర్చారు. అలాగే తప్పిపోయిన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పోలీస్ శాఖ మరియు రెవెన్యూశాఖ వారిని ఆదేశించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి, మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పోస్టుమార్టం త్వరగా నిర్వహించాలని అక్కడ వున్న ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.