30వ తేదీ లోగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూర్తి చేయాలి. జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

Published: Tuesday June 28, 2022
మంచిర్యాల బ్యూరో, జూన్ 27, ప్రజాపాలన:
 
క్రీడా రంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన క్రీడా ప్రాంగణాల ఏర్పాటులో భాగంగా జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యాలను ఈ నెల 30వ తేదీ లోగా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్ నుండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రాజస్వ మండల అధికారులు, తహశిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 548 గ్రామాలలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కొరకు 445 గ్రామాలను గుర్తించడం జరిగిందని, 413 స్థలాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు అప్పగించడం జరిగిందని తెలిపారు., మిగిలిన ప్రాంతాలను 2 రోజులలో గుర్తించడంతో పాటు పిట్టింగ్ పనులను 30వ తేదీ లోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల అభివృద్ధి పనులు కొనసాగుతు న్నాయని, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద 97 పాఠశాలల్లో వంటశాల పనులు మంజూరు కాగా 59 గ్రౌండింగ్ చేయబడ్డాయని తెలిపారు. , ప్రహారీగోడ నిర్మాణ పనులకు 135 పాఠశాలలలో 108 గ్రౌండింగ్ చేయడం జరిగిందని, మిగిలిన పనులను 3 రోజుల్లో త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం వహించవద్దని, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం సిబ్బంది పూర్తి స్థాయిలో పని చేయడంతో పాటు ప్రతి రోజు చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. బృహత్ పల్లెప్రకృతి వనాలు, అవెన్యూ ప్లాంటేషన్ లలో మొక్కల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో నాటేందుకు అవసరమైన మొక్కలను నర్సరీలలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠధామాలలో నీరు, విద్యుత్ సరఫరా ఇతరత్రా సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.