18 సం||లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. ..రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్

Published: Wednesday July 27, 2022
మంచిర్యాల బ్యూరో,  జులై 26, 
ప్రజాపాలన  :
 
 
 
18 సం||లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటరు జాబితా రూపకల్పన, గరుడ యాప్ వినియోగంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సం||లు నిండి ప్రతి ఒక్కరి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ఆవశ్యకత, ప్రాధాన్యతను వివరించి అర్హత గల ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకోవడం జరిగేదని, ఈ సంవత్సరం నుంచి జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకుంటూ 18 సం||లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. జాబితాపై ఆగస్టు 4 నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ప్రీ రివిజన్ నిర్వహించి నవంబర్ 9వ తేదీన ముసాయదా ఓటరు జాబితా విడుదల చేయాలని   సదరు జాబితాపై అభ్యంతరాలను స్వీకరించాలని తెలిపారు.  ఆగస్టు 1వ తేదీ నుండి ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వద్ద నుంచి ఆధార్ వివరాలు సేకరించాలని, ఆధార్ వివరాలు అందించడం ఐచ్చికం మాత్రమేనని, ఓటర్ల ఆధార్ వివరాలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ - ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి. ఎన్నికల డి.టి. శ్రీనివాస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు