కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న పాలకులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయుల

Published: Saturday November 19, 2022

బోనకల్, నవంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి: పాలకులే కార్మికుల శ్రమ దోపిడీ చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. బోనకల్ మండల కేంద్రంలో శుక్రవారం సాధన పల్లి అమరనాథ్ అధ్యక్షతన జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కార్మికుల శ్రమ దోపిడీ గురవుతున్నారని, ఆ శ్రమ దోపిడీకి పాలకులే ఊతం ఇవ్వడం ఎంతవరకు సబబు అన్నారు. ఎనిమిది గంటల పని విధానం కొరకు జరిగిన పోరాటంలో ఎర్రజెండా ఆవిర్భవించిందని, ఆ పోరాట చిహ్నంగానే ప్రపంచవ్యాప్తంగా మేడే ఉత్సవాలు నిర్వహిస్తారని ఆ పోరాటాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా మోడీ పని గంటల విధానాన్ని మార్పు చేశారన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసే విధంగా చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా మార్పు చేసి కార్మికుల శ్రమను కార్పొరేటర్ శక్తులకు దోచిపెడుతున్నారని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 27, 28, 29 తేదీలలో యాదాద్రి లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సమావేశానంతరం మహాసభల గోడపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, బొమ్మినేని కొండల్ రావు, అకేనా పవన్,షేక్ తాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.