అతిరుద్ర మహాయజ్ఞ సప్తాహం విజయవంతం

Published: Thursday December 29, 2022
వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి
వికారాబాద్ బ్యూరో 28 డిసెంబర్ ప్రజా పాలన : అతిరుద్ర మహాయజ్ఞ సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహించుటకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్ధం దేశంలోనే మూడవసారి జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి మైదానంలో వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి, బ్రహ్మశ్రీ బాల మార్తాండ మహారాజ్ (చయన యాజి) మాణిక్ ప్రభు నగర్ వారి ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఘనంగా నిర్వహించామని స్పష్టం చేశారు. అతిరుద్ర మహాయజ్ఞ సప్తాహం మంగళవారం పూర్ణాహుతితో పూర్తయింది. మహా యజ్ఞంలో 24 గంటలు నిరంతరం శివలింగానికి రుద్రాభిషేకం, శ్రీ మహాగణపతి, శతచండి, రాజశ్యామల, మహా సుదర్శన, సాహితీ చతుర్వేద పారాయణ, సంతత ధారాభిషేక యుక్త, శాంతి కళ్యాణ సప్తాహ మహోత్సవం, ప్రతిరోజు పంచాక్షరి మంత్ర అఖండ మహా కీర్తన, అఖండ సంతత ధారాభిషేకం, ప్రతిరోజు ప్రతి ఒక్కరికి శివలింగాన్ని అభిషేకించే భాగ్యం కలిగించడం జరిగింది. పట్టణ ప్రధాన వీధులలో స్వామివారి రథోత్సవం ఎన్నడు లేని విధంగా కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తనతో మొదలై మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అతిరుద్ర మహాయజ్ఞ స్వాహాకార సహిత, శతచండి, రాజశ్యామల మహా సుదర్శన, సంకల్పిత దేవత ఆవాహనము హోమాలు, లలితా విష్ణు సహస్రనామం, స్తోత్ర పారాయణములు, అతిరుద్ర  స్వాహాకార సహిత సంకల్పిత ఆవాహనములు, కళ్యాణ మహోత్సవములు, మహా మంగళహారతి, వేదసేవ ప్రవచనములు, సాంస్కృతిక కార్యక్రమాలతో అతిరుద్ర మహాయజ్ఞం ఘనంగా నిర్వహించడం జరిగింది. దైవ సంకల్పంగా నిర్వహించబడ్డ కార్యక్రమం వికారాబాద్ జిల్లా ప్రజల అదృష్టం అని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ కొనియాడారు.  300కు పైగా మహిళా సేవాదళ్ సభ్యులు యజ్ఞంలో పాలుపంచుకొని, ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని, అతిరుద్ర మహాయజ్ఞం విజయవంతం కావడంలో విశేష సేవ చేసినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. అతిరుద్ర మహాయజ్ఞం విజయవంతంగా జరగడానికి పెద్ద మనసుతో విరాళాలు అందించిన వారికి, ప్రతిరోజు పూర్తి సహాయ సహకారాలు అందించిన పోలీస్ శాఖ వారికి, మున్సిపల్ సిబ్బందికి, విద్యుత్ శాఖ వారికి, ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అని వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులు, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు తెలిపారు.