పట్లూరు గ్రామంలో బోరు నుండి నీటి ఊట

Published: Wednesday August 04, 2021

మిషన్ కాకతీయ సత్ఫలితమే నీటి ఊట

సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్

వికారాబాద్ బ్యూరో 03 ఆగస్ట్ ప్రజాపాలన : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు భూగర్భజలాలు ఉప్పొంగుతున్నాయని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అన్నారు. మంగళవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామానికి చెందిన మున్నూరు అంజయ్య పొలంలోని బోరు బావి నుండి మోటర్ ఆన్ చేయకుండానే నీరు ఉబికి వస్తున్నది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు నిండు కుండలా తలపిస్తున్నాయని పేర్కొన్నారు. బోర్లు, బావులలో నీటి మట్టం పెరిగిందని వివరించారు. తాగు సాగు నీటికి ఈ ఏడాది ఏ ఇబ్బంది రాదని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతే రాజుగా మారాలనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా నేడు సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు. పంచలింగాల్, కొంశెట్ పల్లి, మొగిలిగుండ్ల చెరువుల్లో పూడిక తీయడం వలన భూగర్భ జలాలు పెరగడానికి కారణమన్నారు. కొంశెట్ పల్లి ప్రాజెక్టుకు సమీపంలో మున్నూరు అంజయ్య పొలం ఉండడంతో బోరుబావి నుండి నీరు ఊటలా వస్తుండవచ్చు అన్నారు. భూగర్భ జలాలు పెరగడం సంతోషించదగిన విషయమని కొనియాడారు.