నిరుద్యోగులతో చెలగాటమాడితే కేసీఆర్ ఖబడ్దార్

Published: Friday April 22, 2022
వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి
ఎన్నికలప్పటి నుంచి నిరుధ్యోగభ్రుతి ఇవ్వాలి
ఫార్వర్డ్ బ్లాక్ ఉత్తర తెలంగాణ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి.
కరీంనగర్, ఏప్రిల్ 21 ప్రజాపాలన: తెలంగాణలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఇప్పటివరకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులతో చెలగాట మాడుతున్నాడని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉత్తర తెలంగాణ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి పేర్కొన్నారు. వారం రోజుల్లో ఇవ్వకుంటే కేసీ ఆర్ ఖబడ్దార్ అని హెచ్చరించారు. గురువారం కరీంనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రిగా కేసీ ఆర్ హయాంలోని గత 8 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పోలీస్ ఉద్యోగాలు తప్ప ఇతర శాఖల్లోఖాళీల భర్తీ చేయలేదని పేర్కొన్నారు. తిరిగి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో మహబూబ్ నగర్ బహిరంగ సభ సాక్షిగా నిరుద్యోగులకు వరం అనే ప్రగల్బాలు పలికారని, దాదాపు 12 నుంచి 14 గంటలు ఊరించి ఉద్యోగ ప్రకటనలు చేశారని పేర్కొన్నారు. దాదాపు 2.50 లక్షల ఉద్యోగ ఖాళీలను ప్రకటిస్తూనే అందులో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారన్నారు. ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులను ఊరించిన ప్రకటనతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీయువకులు అప్పులు చేసి పట్టణాలకు వచ్చి కోచింగ్ లకు వెళుతున్నారని పేర్కొన్నారు. వేలాది రూపాయల ఫీజులతో రైతు బిడ్డలు నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు. పుట్టగొడుగుల్లా వెలిసిన కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల పేరుతో ఫీజు దోపిడీ సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే 26 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్ పీఎస్ సీ వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. నిరుద్యోగుల నుంచి అంత పోటీ ఉండగా వారి ఆసరా  చేసుకుని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అనుమతులు లేకున్నా దండుకుంటున్నారని, చిన్న చిన్న గదులు, ఫంక్షన్ హాళ్లలో కిక్కిరిసేలా కూర్చోబెడుతున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం సుమారు 6 లక్షల మంది ధరఖాస్తు చేసుకుంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడం, ధరఖాస్తు తేదీని పొడిగించకపోవడంతో లక్షలాది మంది నష్టపోతున్నారని తెలిపారు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను ఏడేళ్లు గా భర్తీ చేయడం లేదన్నారు.  2018లో ఎన్నికల హామీలో భాగంగా యువతకిచ్చిన హామీ లేవీ అమలు కాలేదన్నారు. అర్హులైన నిరుద్యోగులకు 3016 రూపాయల నిరుద్యోగ భ్రుతి ఇస్తామని చెప్పి మాటతప్పారన్నారు. గడిచిన యేళ్ల భ్రుతి ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లివ్వలివ్వడం లేదంటూ అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దానికి కేసీ ఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను కాపాడాలన్నారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణనివ్వాలన్నారు. వారం పది రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే నిరుద్యోగులు, యువత పక్షాన ఏఐఎఫ్ బీ ఆద్వర్వంలో ప్రగతిభవన్, కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యకర్తలు సంతోష్, పెద్దెల్లి శేఖర్, బండ లింగమూర్తి, బెజ్జంకి చంద్రకాంత్ తదితరులున్నారు