కారులో వర్గ విభేదాలు...! – జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ వ‌ర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు – మ‌ర్ప‌ల్లిలో పోట

Published: Thursday July 14, 2022
వికారాబాద్‌ బ్యూరో జూలై 13 ప్రజాపాలన : వికారాబాద్ జిల్లాలోని కారులో వర్గ విభేదాలు భగ్గుమన్నవి. వికారాబాద్ ఎమ్మెల్యే, జిల్లా అధ్య‌క్షుల డాక్టర్ మెతుకు ఆనంద్, జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునితారెడ్డిల మ‌ద్య ప్రోటోకాల్ వ్య‌వ‌హారం హీటెక్కింది. జిల్లాలోని మ‌ర్ప‌ల్లిలో జ‌రిగిన సునీత‌మ్మ ప‌ర్య‌ట‌న‌లో ఈ మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఎమ్మెల్యే వ‌ర్గీయులు జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ కారుపై రాళ్లు రువ్వ‌డంతో రాజ‌కీయం ఉద్రిక్తంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. బుధవారం మర్పల్లి మండలంలో ఓ మందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ సునితారెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో సునీత రెడ్డి కారుపై.. కారణం చెప్పకుండానే కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. మర్పల్లి గడ్డ ఆనంద్ అన్న అడ్డా అనే నినాదాలతో  టిఆర్ఎస్ కార్యకర్తలు హోరెత్తించారు. స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్‌ను అవమానించేలా కార్యక్రమాలు నిర్వహించడం సరైనది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి. నాపై జరిగిన దాడిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా అన్నారు.
 అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తన వ్యవహార శైలి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రోటోకాల్ ఎలా పాటించాలో మాకు తెలియదా..? మాకు ప్రజల మద్దతు ఉంది. ఆనంద్ వ్యవహార శైలితో కార్యకర్తలందరూ అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, డాక్టర్లకు నామినేటెడ్ పోస్టులు, పార్టీ మండల అధ్యక్ష పోస్టులు ఇస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు అన్నారు. ఎలాంటి కారణం చెప్పకుండానే నా కారుపై దాడి చేస్తారా..? జిల్లా అధ్యక్షుడి వ్యవహార శైలిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా అంటూ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్య‌వ‌హారంతో వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్, జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ సునితారెడ్డిల మ‌ద్య జ‌రుగుతున్న వ‌ర్గ‌పోరు బ‌హిర్గ‌త‌మైంది. ఈ సంఘ‌ట‌న జిల్లా రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
 
 
 
Attachments area