ట్రాఫిక్ ఖాతం కలిగిస్తే చర్యలు : తల్లాడ ఎస్సై ఎం.సురేష్

Published: Monday December 13, 2021
తల్లాడ, డిసెంబర్ 12 (ప్రజాపాలన న్యూస్): కేసుల పరిష్కారంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పరిష్కరిస్తానని తల్లాడ పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ ఎం.సురేష్ అన్నారు. ఆదివారం తల్లాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ విషయాన్ని, ఏ సమస్యనైనా ముక్కుసూటిగా మాట్లాడుతానన్నారు. ప్రొఫెషనల్ గా వెళ్లాలనే ఉద్దేశంతో పట్టుదలతో చదివి ఎస్సై ఉద్యోగం సాధించినట్లు వెల్లడించారు. ఏ విషయాన్ని అయినా తనకు తెలియజేయాలని, రాజకీయ ఒత్తిళ్లకు తగ్గకుండా సమస్యను పరిష్కరిస్తానన్నారు. మండలంలో ప్రశాంత వాతావరణం ఉందన్నారు. తల్లాడ పట్టణంలో దుకాణదారులు ప్రధానరహదారి వద్దకు వస్తున్నారని, దుకాణాలను ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా లోపలకు జరపుకోవాలని సూచించారు. వాహనాలను రోడ్లపై నిలుపు వద్దన్నారు. వాహనదారులు తప్పకుండా మాస్కులు, హెల్మెట్లు ధరించాలన్నారు. తల్లాడలోని కొత్తగూడెం రోడ్డులో ట్రాఫిక్ సమస్యకు తలెత్తుతుందని, ఎవరైనా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మండలంలోని ప్రతి గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇటీవల మిర్చి ధరపై ఫేక్ వార్తలు బయటకు వచ్చాయని, ఇటువంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల ప్రజలు, రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు.