ఏరియా ఆసుపత్రి లో కరోనాతో వృద్ధురాలు మృతి

Published: Wednesday April 21, 2021

-వ్యాక్సిన్ కరువు - టీకాలు లేవు.
క్యాతనపల్లి, ఏప్రిల్ 20, ప్రజాపాలన : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో సింగరేణి యాజమాన్యం కార్పోరేటు ఆసుపత్రులకు ధీటుగా వైద్యం అందించడంతో పాటు ప్రత్యేకమైన కోవిడ్ 19 ఐసోలేషన్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా ఏరియా ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చినవారు మృతి చెందడం పట్ల వైద్యాధికారి తీరుపట్ల కార్మికులు, కార్మికేతరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో ఏరియా ఆసుపత్రి నుండి కరీంనగర్ కు తీసుకెళ్తుండగా కరోనా సోకిన వ్యక్తి మృతిచెందడం, భగత్ సింగ్ నగర్ కు చెందిన మహిళ ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం రాగా వైద్యుల సూచనల మేరకు పరీక్షకు వెళ్లి వరుసక్రమంలో నిలబడి మృతిచెందడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఈ ఘటనలు మర్చిపోక ముందే మంగళవారం శ్రీరాంపూర్ ఎస్సార్పీ కాలనీకి చెందిన లక్ష్మి (73) వృద్ధురాలు ఏరియా ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో కరోనా వ్యాధికి చికిత్స పొందుతూ మృతిచెందడం అధికారుల మెరుగైన చికిత్స విధానానికి అద్దంపడుతుంది. అంత్యక్రియలకు క్యాతనపల్లి పురపాలక సంఘం కమీషనర్ కు సమాచారం ఇవ్వగా అధికారులు వెనువెంటనే అంత్యక్రియలు పూర్తిచేశారు.
వ్యాక్సిన్ కరువు టీకాలు లేవు:
ఏరియా ఆసుపత్రి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చు స్థలం వద్ద ఆసుపత్రి వర్గం వ్యాక్సిన్ సరఫరా లేనందున ఈ రోజు టీకాలు లేవనే గోడప్రతిని ఏర్పాటు చేయడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం వివిధ, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులు ఆసుపత్రి డివైసిఎంఓ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార వర్గాలు ముందుగా పత్రిక ప్రకటన, సోషల్ మీడియా వివిధ రకాలుగా వ్యాక్సిన్ లేదనే విషయాన్ని ప్రచారం చేయకపోవడంతో ఆసుపత్రి వరకు వచ్చి వెనదిరగడం ఆసుపత్రి వర్గాల వైఫల్యానికి అద్దం పడుతుందా?
చలించని ఉన్నతాధికారులు :
ఏరియా ఆసుపత్రి వైద్యాధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలికాగా, మౌళిక వసతులు లేక పరీక్షలకు వచ్చిన వ్యక్తులు నిస్పృహలకు లోనవుతూ పరీక్షలు నిర్వహించడం కొసమెరుపు. ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం బయటపడుతున్నా ఉన్నతాధికారులు చలించకపోవడం గమనార్హం.