మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ : మంత్రి తలసాని

Published: Wednesday May 04, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ): మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రంజాన్ సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ ముస్లీం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో మంత్రి పాల్గొన్నారు. ఈ ప్రార్ధనలలో నగరంలోని పలు ప్రాంతాల నుండి. ముస్లీం సోదరులు వేలాదిగా పాల్గొన్నారు. ప్రార్ధనలు ముగిసిన అనంతరం ముస్లీం లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట సనత్ నగర్ డివిజన్ TRS అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. అదేవిధంగా రాంగోపాల్ పేట డివిజన్ లోని నల్లగుట్ట లో ముస్లీం సోదరులు మసీదులో ప్రార్ధనలు చేసిన అనంతరం మంత్రి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి తదితరులు ఉన్నారు. అదేవిధంగా బన్సీలాల్ పేటలోని బోయగూడ లోని ముస్లీం బస్తీ వాసుల ఆహ్వానం మేరకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ రంజాన్ విందుకు హాజరయ్యారు. స్థానిక కార్పొరేటర్ కుర్మ హేమలత, బస్తీ ముస్లీం లతో కలిసి భోజనం చేశారు. ముందుగా మంత్రి బస్తీ ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని ఈ సందర్భంగా ముస్లీం సాంప్రదాయ వస్త్రాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లీం సోదర సోదరీమణులు నెల రోజులు ఎంతో నిష్ఠతో ఉపవాసం పాటిస్తారని, వారికి కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం ఎప్పటి నుండో వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా పేద ముస్లీం లకు రంజాన్ సందర్భంగా దుస్తులను పంపిణీ చేయడమే కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది తమ ప్రభుత్వం ఆలోచన అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.