గ్రామ సింహాల నుండి ఎలా రక్షించుకోవాలి

Published: Friday March 03, 2023
* వికారాబాద్ మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర
వికారాబాద్ బ్యూరో 02 మార్చి ప్రజాపాలన :  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం వీధి కుక్క ( గ్రామ సింహాలు ) ల నుండి రక్షించుకోవడం ఎలా అనే అంశం పై అవగాహన సదస్సు నిర్వహించామని వికారాబాద్ మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర అన్నారు. గురువారం
వికారాబాద్  మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర అధ్యక్షతన మెప్మా రిసోర్స్ పర్సన్ లకు అవగాహన సమావేశం జరిగింది. ఇట్టి అవగాహన సదస్సులో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామ సింహాలను చూసి పరిగెత్తకుండా నిలబడాలని స్పష్టం చేశారు. కుక్కలు దగ్గరగా ఉన్నప్పుడు వేగంగా నడవకూడదని అలా చేస్తే అవి మీ వెంట పడతాయని హెచ్చరించారు. కుక్క కళ్ళల్లోకి సూటిగా చూడవద్దని అలా చేస్తే అట్టి కుక్కను రెచ్చగొట్టినట్లు భావించి అవి కరుస్తాయని చెప్పారు. ఆహారం తింటున్న, నిద్రిస్తున్న, పిల్లలు ఉన్న తల్లికుక్కలను ఎప్పుడూ ఆందోళనకు గురి చేస్తూ వాటి మీదకు వెళ్ళవద్దని వెల్లడించారు. కుక్కలను భయపెడితే అవి మిమ్మల్ని కరవచ్చు అన్నారు. కావున ఎట్టి పరిస్థితిలో కుక్కలపై రాళ్లు గాని కర్రలుగాని విసరవద్దని  తెలిపారు. పురపాలక సంఘం ద్వారా పట్టణంలోని 34 వార్డుల్లో  వీధి కుక్కలను యానిమల్ కేర్ సెంటర్ కు తరలించి వాటికి శస్త్ర చికిత్స చేసిన అనంతరం తిరిగి వదిలిపెడుతున్నామని వివరించారు. ప్రతి రిసోర్స్ పర్సన్ కూడా వార్డులలో జరిగే మహిళ సంఘాల సమావేశాలలో ఇట్టి అంశాలను మహిళా సంఘాలు సభ్యులతో చర్చించాలని చెప్పామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ మొహియోద్దిన్, టౌన్ మిషన్ కోఆర్డినేటర్ వెంకటేష్, సి. ఓ లు విశాల రాణి, భాగ్యలక్ష్మి, డి.ఈ. ఓ శ్రీకాంత్, మెప్మా  రిసోర్స్ పర్సన్ లు    పాల్గొన్నారు.