ప్రతి పండుగను ప్రజలంతా కలిసి మెలసి సంతోషంగా జరుపుకోవాలి జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Wednesday December 21, 2022
మంచిర్యాల బ్యూరో,  డిసెంబర్ 20, ప్రదాపాలన  :
 
ప్రతి పండుగను ప్రజలంతా కలిసి మెలసి సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం చేపట్టిన క్రైస్తవులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని మౌంట్ గెన్ చర్చ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనది లౌకిక దేశమని, మన దేశంలో వివిధ భాషలు, ప్రాంతాలు, మతాలు, అనేక సంస్కృతులు ఉన్నాయని, ఎన్ని ఉన్నా, ఎక్కడా ఉన్నా మనమంతా కలిసి ఉ ండాలని, అందరు సమానమేనని అన్నారు. మతాలతో సంబంధం లేకుండా ఏ పండుగ అయినా అందరితో పాటు పేద ప్రజలు సైతం సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ఇందులో భాగంగా జిల్లాకు 3 వేల 500 గిఫ్ట్ ప్యాకేజ్లు వచ్చాయని, మంచిర్యాల నియోజకవర్గం కొరకు 1 వేయి 500 గిఫ్ట్ ప్యాకేజ్లు కేటాయించడం జరిగిందని, ప్రతి నియోజకవర్గానికి 2 లక్షల రూపాయల చొప్పున క్రిస్మస్ ఫీస్ట్ ఏర్పాటు కొరకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. క్రిస్మస్ పండుగను ప్రజలంతా కలిసిమెలసి ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.