కూలి, భూమి పోరాటాలను ఉధృతం చేస్తాం. - జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్ట పరిరక్షణ పోరాటాలు కొనసాగిస

Published: Monday November 21, 2022

చౌటుప్పల్, నవంబర్ 20 (ప్రజాపాలన ప్రతినిధి) భూమిలేని పేదలకు ప్రభుత్వ మిగులు భూములు పంచాలని, కనీస కూలీ రోజుకు 600 ఇవ్వాలని జిల్లా వ్యాప్తంగా పోరాటాలను ఉదృతం చేస్తామని, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్ట పరిరక్షణ కోసం పోరాటాలను కొనసాగిస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ తెలియజేసినారు. ఆదివారం స్థానిక కందాల రంగారెడ్డి భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల ఆరవ మహాసభ గంగాదేవి సైదులు, మామిడి స్వరూప అధ్యక్షతన జరగగా మహాసభకు ముఖ్య అతిధులుగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గత 50, 60 సంవత్సరాలుగా ప్రభుత్వ భూములను పేదలు సేద్యం చేసుకుని జీవిస్తున్నారని వారందరికీ వెంటనే నూతన పాస్బుక్కులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. జిల్లాలో ఆరు మండలాల్లో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరినారు. గత ఎనిమిది సంవత్సరాలుగా అత్యంత నిరుపేదలైన వ్యవసాయ కూలీలు, పేదలు ఇండ్లు, ఇళ్ల స్థలాలు లేక ఓకే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు కాపురం చేస్తూ అనేక అవస్థలు పడుతున్నారని వారందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను, ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు తక్షణ ఇవ్వాలని అన్నారు. మూసీ ప్రాంతంలో వ్యవసాయ పనులు చేసే కూలీలు మరియు పత్తి చేలల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు విషకాలుష్యంతో అనేక జబ్బులకు గురవుతున్నారని వ్యవసాయ కూలీలు నివసించే ప్రాంతాలలో ప్రభుత్వము ఇంటింటికి ఆరోగ్య సర్వే నిర్వహించి కూలీలకున్న జబ్బులకు ప్రభుత్వమే బాధ్యతగా వైద్యం అందించాలని డిమాండ్ చేసినారు. ఇంకా గ్రామాలలో అర్హత కలిగిన నిరుపేదలు పెన్షన్ల కోసము దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారని వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలని పెద్ద కుట్ర చేస్తుందని దీనిని వ్యవసాయ కూలీలు జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులు ఐక్యంగా పోరాడి చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదని నర్సింహ తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా నాయకులు తడక మోహన్, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి బొజ్జ బాలయ్య, జిల్లా కమిటీ సభ్యులు బోయ యాదయ్య పాల్గొని మాట్లాడగా మహాసభలో చింతల సుదర్శన్, పొట్ట వెంకటయ్య, రాపోలు పద్మ, మానే సాలయ్య, గుండబోయిన సబిత, మీసాల శ్రీను, యాట బాలరాజు, నత్తి నరేష్, సంగం సత్తయ్య, జంగం అంజయ్య, సంగం సత్తమ్మ, ప్రమీల, దేవరశెట్టి సురేష్, కొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు,