మాత శిశు ఆరోగ్య కేంద్రానికి వేరే చోట పనులు ప్రారంభించాలి

Published: Wednesday August 03, 2022
బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్  డిమాండ్
 
మంచిర్యాల టౌన్, ఆగష్టు 02, ప్రజాపాలన: *మాత శిశు ఆరోగ్య కేంద్రానికి వేరే చోట భూమిని కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ డిమాండ్ చేశారు.
ఇటీవల వచ్చిన వరదల వల్ల నీట మునిగిన ప్రభుత్వ మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం రోజు న బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్, బిజెపి నాయకులు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమర్థ ఎమ్మెల్యే దివాకర్ రావు ముందు చూపు లేకుండా గోదావరి నది దగ్గర ఆసుపత్రి కట్టడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని అన్నారు. గతంలో కలెక్టర్ కార్యాలయం నిర్మాణానికి పనికి రాని భూమి, మాత శిశు ఆరోగ్య కేంద్రానికి అధికారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.  సరైన ప్రణాళిక లేకుండా ఆసుపత్రి నిర్మించడం వల్లనే ఈరోజు వేల కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా అయింది అని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న మిషనరీ, వైద్య పరికరాలు, మందులు, విద్యుత్ సామగ్రి పూర్తిగా చేడిపోయాయని, ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని తక్షణమే ఏదైనా ఒక భవనంలో తాత్కాలికంగా ప్రారంభించాలని, యుద్ద ప్రాతిపదికన మరొక చోట ప్రభుత్వం భూమిని కేటాయించి ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణంలో వరదలు వచ్చి 20 రోజులు దాటిన ఇప్పటి వరకు ఏ ఒక్క బాధితునికి వరద నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి జిల్లా వరద బాధితులను ఆదుకోవాలని అడగకపోవడం వల్లనే జిల్లాకు నిధులు విడుదల కాలేదు అని అన్నారు. వెంటనే జిల్లాకు వరద ప్యాకేజీ ప్రకటించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే రోజుల్లో వరద బాధితులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రజినిష్ జైన్, ఆనంద్ కృష్ణ, బోయిని హరికృష్ణ, రంగ శ్రీశైలం, జోగుల శ్రీదేవి, బియ్యాల సతీష్ రావు, ముదాం మల్లేష్, బద్దరపు రాజమౌలి, రాచకొండ సత్యనారాయణ, పచ్చ వెంకటేశ్వర్లు, అమీరిశేట్టి రాజు, బల్ల రమేష్, బోయిని దేవేందర్, పల్లే రాకేష్, స్వప్న రాణి, తోట మల్లికార్జున్, దయాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.