కేసుల పరిష్కారంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ నెంబర్ వన్ : బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్

Published: Monday March 14, 2022
బెల్లంపల్లి, మార్చి 13, ప్రజాపాలన ప్రతినిధి: లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరిం చడంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి సబ్ డివిజన్ రెండు వేల కేసులకు పైగా పరిష్కరించి నెంబర్ వన్ గా నిలిచిందని బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ తెలిపారు. శనివారం  జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో పరిష్కరించిన కేసుల వివరాలను ఆయన పత్రికల వారికి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల పేరుతో సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కక్షిదారులకు లోక్‌అదాలత్‌ ఒక వరంలా మారిందని అన్నారు. క్రిమినల్‌ కేసులతోపాటు ప్రీలిటిగేషన్‌ కేసుల్లోనూ, ఇరువర్గాలకు రాజీ కుదిర్చి శాశ్వత పరిష్కారాన్ని చూపెడు తున్నదని, చిన్నపాటి గొడవల నుంచి ఆర్థిక లావాదేవీలు, భూవివాదాలు, అత్తింటి వేధింపులు, మనోవర్తి, చట్టరీత్యా రాజీకి అర్హమైన కేసుల్లో పైసా ఖర్చు లేకుండా ఇరువర్గాలకు న్యాయం జరిగేలా కోర్టు ఇచ్చిన అవకాశాన్ని బాధితులకు పోలీసులు వివరించి పరిష్కార మార్గాలను సూచించారని తెలిపారు. ఫలితంగా రెండు వేలకు పైగా కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించే అవకాశం లభించిందని అన్నారు. ఇందులో ఐపీసీ సంబంధించిన 112 కేసులు డి డి కి సంబంధించిన 225 కేసులు ఈ  పిటి కి సంబంధించిన 1967 కేసులు మొత్తంగా 2304 కేసులు పరిష్కారంప బడ్డాయని ఆయన తెలిపారు. కేసుల పరిష్కారానికి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి కేసుల రాజీకి ప్రయత్నించిన సబ్ డివిజన్ పరిధిలోని సీఐలకు, ఎస్ఐలకు, పోలీస్ కానిస్టేబుల్స్ కి అందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా బెల్లంపల్లి కోర్టు న్యాయమూర్తికి, బార్ అసోసియేషన్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.