వరి ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగితే క్రిమినల్ చర్యలు

Published: Thursday October 27, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 25 అక్టోబర్ ప్రజా పాలన : వరి ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగితే క్రిమినల్ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నిఖిల హెచ్చరించారు. బుధవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డిపిఆర్సి భవన్ లో వానాకాలం ధాన్యం కొనుగోలు పై నిర్వాహకులకు  శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..  రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్దేశించిన సమయంలో వరి ధాన్యం సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  కొనుగోలు సమయంలో ఎటువంటి లోపాలు జరిగినా వరి ధాన్యం సేకరణ కేంద్రాల ఇంచార్జులు,  వ్యవసాయ విస్తరణ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో గతంలో కంటే అధికంగా ధాన్యాన్ని సేకరించవలసి వస్తుందని, ప్రస్తుతం వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించవలసి ఉంటుందని దానికి అనుగుణంగా అన్ని సౌకర్యాలను  కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 3వ తేదీ నుండి చేపట్టే వరి ధాన్యం సేకరణకు గాను 121 కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద రైతులకు మౌలిక సదుపాయాలతో పాటు మంచినీరు సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో ప్రతి ఒక్కరూ సహకరించుకుంటూ కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు పూర్తి బాధ్యతతో పారదర్శకంగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.  రైతులు ఉన్నప్పుడు వారి సమక్షంలోనే వరి ధాన్యం తూకం చేయాలని,  రైతుల నుండి ధాన్యాన్ని సేకరించిన రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర మేరకు నగదు వారి ఖాతాలో చేరే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధన ప్రకారం నాణ్యత ప్రమాణాల మేరకు ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆమె అన్నారు.  ప్రతి కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడవకుండా ఉండేందుకు 20 టార్ పాలిన్ (తాడుపత్రి) లను, ధాన్యం క్లీనింగ్ మిషన్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. రైతుల వివరాలను, ధాన్యం  సేకరణ  వివరాలను ట్యాబ్ లలో పొందుపరచాలని కలెక్టర్ సూచించారు.
 జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మిల్లింగ్ కు మిల్లర్లు ముందుకు వచ్చారని కలెక్టర్ తెలిపారు. అదనంగా  వచ్చే ధాన్యం నిలువలకు గోదాములను గుర్తించడం జరిగిందని అన్నారు. వరి ధాన్యం సేకరణకు అవసరమైన గోనెసంచులను అందుబాటులో ఉన్నాయని అన్నారు.
వరి ధాన్యం  సేకరణకు  ప్రతి కేంద్రం నుండి రెండు లారీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా లారీల  నంబర్లు,  డ్రైవర్ల ఫోన్ నెంబర్లు కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా వానాకాలం 2022-23 వరి పంటకు మద్దతు ధర గోడ ప్రతిని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ విమల, డి ఆర్ డి ఓ కృష్ణన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలేశ్వర్ గుప్తా, మిల్లర్లు,  సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.