కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని ప్రణాళికబద్దంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ భారతి హోళ్

Published: Wednesday January 18, 2023
మంచిర్యాల బ్యూరో, జనవరి 17 ,ప్రజాపాలన: .
 
కంటి వెలుగు 2వ విడత కార్యక్రమ నిర్వహణ కొరకు రూపొందించిన కార్యచరణ ప్రకారంగా ప్రణాళికబద్దంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్లో గల కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా. జి.సి. సుబ్బారాయుడుతో కలిసి వైద్యాధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, కంటి వెలుగు వైద్యులు, మండల పంచాయతీ అధికారులు, ప్రత్యేక అధికారులతో కంటి వెలుగు సన్నాహక ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీసు, వైద్య-ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో కంటి వెలుగు శిబిరాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాలని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ కొరకు జిల్లాలో 40 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి బృందంలో టేబుల్ వారిగా నియమించిన సిబ్బంది వారికి కేటాయించిన విధులను పకడ్బంధీగా నిర్వహించాలని తెలిపారు.  గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కంటి పరీక్ష శిబిరాలలో 150 మందికి, పట్టణ ప్రాంతాలలో 200 మందికి పరీక్షలు నిర్వహించాలని, రోజు వారిగా కంటి సమస్య ప్రకారం కంటి అద్దాల పంపిణీ చేపట్టాలని అన్నారు. ఈ నెల 19న తేదీన ఉదయం 9 గం||లకు జిల్లాలో ఏర్పాటు చేసిన 40 కంటి వెలుగు శిబిరాలను ఒకేసారి ప్రారంభించేందుకు ఆయా స్థానిక ప్రజాప్రతినిధుల వివరాలను అందించగా, సమయానికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రతి శిబిరం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో ముందస్తుగా ప్రతి ఒక్కరు తమ ఆధార్కార్డుతో శిబిరానికి హాజరయ్యే విధంగా టాం-టాం చేయించాలని తెలిపారు. కంటి శిబిరాల నిర్వహణ కొరకు రూపొందించిన కార్యచరణను ప్రణాళికబద్దంగా అమలు చేయాలని, మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్లలో ఒక అదనపు సిద్దంగా ఉంచాలని, జిల్లాకు కేటాయించిన క్వాలిటీ ఆఫీసర్ అన్ని శిబిరాలను పర్యవేక్షించాలని తెలిపారు. శిబిరం నిర్వహణలో ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే నోడల్ అధికారికి సమాచారం అందించాలని, సాంకేతిక లోపాలు తలెత్తినట్లయితే జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం లో సంప్రదించాలని తెలిపారు.