సిద్దిపేట జిల్లా నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు.

Published: Tuesday April 06, 2021
గ్రంథాలయం అంటేనే ఒక దేవాలయం,ప్రతీ మనిషి నిరంతర విద్యార్థే.
నూతన గ్రంథాలయానికి కవికోకిలగా పేరుగాంచిన సిద్దిపేట కవి వేముగంటి నరసింహచార్యుల గ్రంథాలయంగా నామకరణం.
 
సిద్దిపేట(ప్రజాపాలన ప్రతినిధి) : పుస్తకపఠనంను మించిన జ్ఞాన సముపార్జన ఏది లేదని తల్లిదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుంచే పుస్తకపఠనాన్ని అలవాటు చేయాలని సిద్దిపేట వాసులకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ఆర్ధిక శాఖా మాత్యులు తన్నీరు హరీష్ రావు. సిద్దిపేటలో జరిగిన జిల్లా గ్రంథాలయం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మూడు కోట్ల మూడు లక్షల రూపాయలతో ఈ అధునాతన గ్రంథాలయంను నిర్మించామని ఇందులో 2 కోట్ల పైచిలుకు రూపాయలు భవనానికి, 13 లక్షల రూపాయలు డిజిటల్ లైబ్రరీకి, 40 లక్షల రూపాయలు పుస్తకాలకు కేటాయించామన్నారు. ఈ గ్రంథాలయంలో వనితా విభాగం పేరుతో మహిళలకు, చిన్న పిల్లలకు ఒక విభాగం, ఉర్దూ పాఠకులకు ప్రత్యేకంగా ఉర్దూ విభాగం, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషలకు సంబంధించిన పుస్తకాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయన్నారు.పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, యువతకు ఈ గ్రంథాలయం ఒక వరంగా మారబోతుందన్నారు. వారు పోటీ పరీక్షలకు ఏకాగ్రతతో చదవడం కోసం దాదాపు 40 మంది చదువుకోవడానికి వీలుగా ఒక రీడింగ్ రూమ్ ని ఏర్పాటు చేశామన్నారు. నిశ్శబ్ద వాతావరణంలో ఈ గ్రంథాలయం నిర్మించడానికి స్థల సేకరణకై కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కృషి చేశారన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల ను ఎదుర్కొనే యువత ఈ గ్రంథాలయంను సద్వినియోగం చేసుకోవాలని ఫాస్ట్ ఇంటర్ నెట్ కలిగి ఉన్న 20 కంప్యూటర్ లను డిజిటల్ లైబ్రరీని జాతీయ డిజిటల్ లైబ్రరీ తో అనుసంధానం చేయడం వలన ఏ పుస్తకం కావాలన్నా ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉంటుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్ లు అలాగే కానిస్టేబుల్ నుండి కలెక్టర్ వరకు ఏ ఉద్యోగానికి సంబందించిన స్టడీ మెటీరియల్ ఐనా అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు తమ సొంత స్టడీ మెటీరియల్ ను సైతం తెచ్చుకుని ఇక్కడ ప్రిపేర్ కావచ్చన్నారు. భవిష్యత్తులో ఇక్కడ ప్రిపేర్ అయ్యే యువత కు భోజన వసతి కూడా కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆజ్ఞాపించారని నిరుద్యోగ యువత ఈ గ్రంథాలయం వంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయం అంటేనే ఒక దేవాలయం అని విద్య, విజ్ఞానం ఒకరు దోచుకుంటే పోయేవి కావన్నారు. పుస్తక పఠనం అనే అభిరుచిని, అభిలాషను పిల్లల కు అలవర్చే భాద్యత తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు. ప్రతీ మనిషి నిరంతర విద్యార్థేనన్నారు. సిద్దిపేటకు చెందిన గొప్ప కవి కవికోకిల బిరుదాంకితులు శ్రీ వేముగంటి నరసింహచార్యుల పేరును ఈ గ్రంథాలయానికి నామకరణం చేస్తున్నామని తెలిపారు. పాత గ్రంథాలయ భవనం అలాగే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎం ఎల్ సి ఫారూఖ్ హుస్సేన్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జిల్లా జెడ్ పి చైర్మన్ రోజాశర్మ, మునిసిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, జిల్లా గ్రంథాలయం బోర్డ్ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.