కేంద్రం మరో వడ్డన

Published: Wednesday March 03, 2021
పెట్రోలు నుంచి వంట నూనెల వరకు గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్న వేళ.. ఈసారి రైతుల నడ్డి విరగ్గొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎరువుల ధరలను భారీగా పెంచాలని నిర్ణయించింది. 50 కిలోల ఎరువుల బస్తాపై గరిష్ఠంగా రూ. 250 వరకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఎరువుల ధరలను పెంచేయగా, మరికొన్ని వచ్చే నెల 1 నుంచి పెంపునకు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు రూ. 890గా ఉన్న 20-20-0 రకం ఎరువుల బస్తా నిన్నటి నుంచి రూ. 998కి పెరిగింది. రూ. 975గా ఉన్న ఈ బస్తా ఎమ్మార్పీ ఏకంగా రూ. 1,125కు పెరగడం గమనార్హం. అలాగే, 1,275గా ఉన్న డీఏపీ బస్తా ధర రూ.1,450కి పెరిగింది. పెంచుతున్న ధరల వివరాలను కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తోంది. మిగతా సంస్థలు మరో 15 రోజుల్లో ధరల పెంపును ప్రకటించనున్నాయి. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అవి ముగిసిన తర్వాత యూరియా ధరలను కూడా పెంచాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం.