తెగిన వాగులకు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలి

Published: Wednesday July 28, 2021
ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి
వికారాబాద్ బ్యూరో 27 జూలై ప్రజాపాలన : భారీ వర్షాలకు తెగిన వాగులకు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్ నియోజకవర్గంలో గల ధారూర్ మండలానికి చెందిన దోర్నాల్ వాగు వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టి.రాంమోహన్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధారూర్ మండల కేంద్రానికి సుమారు 20 గ్రామాల ప్రజలు జీవనోపాధి కొరకు రాకపోకలు సాగాస్తుంటారని గుర్తు చేశారు. నిరంతర వర్షాల కారణంగా దోర్నాల్ గ్రామానికి సమీపంలో ఉన్న వాగు తెగడంతో సమీప గ్రామాల ప్రజలు జీవనోపాని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనునిత్యం పదుల సంఖ్యలో ఆటోలు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులకు ధారూర్ మండల కేంద్రానికి చేరుకొనుటకు నరకయాతన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోర్నాల్, అంపల్లి, నాగారం, గురుదొట్ల, తండాల వాసులు దోర్నాల్ వాగును దాటి రావలసి ఉంటుందని పేర్కొన్నారు. మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. నాగసమందర్, దోర్నాల్, మంచన్ పల్లి బ్రిడ్జిలు తెగితే ప్రజల కష్టాలు వర్ణనాతీతం అన్నారు. నాసిరకం రోడ్ల నిర్మాణం వలన భారీ వర్షాలకు తెగుతున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్ళు, నిధులు, నియామకాల గురించి అని ఎత్తి చూపారు. సిఎం కెసిఆర్ పై మూడింటిని మరిచి కాంట్రాక్టర్ల కమీషన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని దెప్పి పొడిచారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టి.రాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును గాలికొదిలి సిఎం కేసీఆర్ తన స్వలాభం కొరకు ప్రణాలికను రూపొందించుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ధారూర్ మండల సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటీసీ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.