రైతు కల్లాల నుండి ధాన్యం తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

Published: Wednesday May 25, 2022
మంచిర్యాల బ్యూరో, మే24, ప్రజాపాలన :
 
రైతు కల్లాల నుండి వరిధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా రవాణ అధికారి కిష్టయ్య, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడుచున్నందున కల్లాల నుండి నాణ్యమైన వరిధాన్యంను కొనుగోలు కేంద్రాలకు, అక్కడి నుండి రైన్ మిల్లులకు తరలింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు లారీల యజమానులు పూర్తి స్థాయి సహకారం అందించాలని కోరారు. ప్రతి రోజు 362 లారీలు ధాన్యం తరలింపులో పాల్గొనాలని, రైనిమిల్లర్లు కేటాయించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవాలని తెలిపారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా జిల్లాలో వరిధాన్యంను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేసి ధాన్యం తడవకుండా నిల్వ చేస్తూ త్వరితగతిన రైన్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిల్లులకు ధాన్యం తీసుకువచ్చే లారీల నుండి అన్లోడింగ్ను వేగంగా చేసి లారీలను తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపించేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.