ప్రభుత్వ సహాయం అందరికీ అందించాలి.

Published: Thursday April 29, 2021

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్థన్ రావు.
మంచిర్యల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్28, ప్రజాపాలన : ప్రైవేటు విద్యాసంస్థలు లో పనిచేస్తున్న  బోధన ,బోదనేతర సిబ్బందికి కరోనా కష్టాల నుంచి ఆర్థికంగా ఆదుకునెందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయం నుప్రైవేట్ పాఠశాలలలో పనిచేసే సిబ్బంది అందరికీ అందేలా చూడాలని ట్రస్మా జిల్లా అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్ రావు పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వం ప్రకటించిన ఆపాత్కాల భృతి 2000/- రూపాయలు మరియు 25కిలోల సన్న బియ్యం సహాయం ప్రైవేట్ పాఠశాలలలో పనిచేసే సిబ్బంది అందరికీ అందేలా చూడాలని ట్రస్మా జిల్లా సంఘం ఆధ్వర్యంలో జిల్లా పాలనాధికారి కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్కు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.వెంకటేశ్వర్లు గార్లకు క వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో కేవలం 2108 మంది సిబ్బందిని లబ్ధిదారులుగా గుర్తించి వారికి ఈ పథకం అమలు చేశారని అన్నారు. ఇందులో  సుమారుగా 350 మంది రేషన్ షాప్ నెంబర్ లు సరిగా లేకపోవడం, 200 మంది బ్యాంక్ అకౌంట్ యొక్క ఐఎప్ ఎస్ సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల వారికి ప్రభుత్వ సహాయం అందలేదని పేర్కొన్నారు. జిల్లాలో సుమారుగా 5 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నారని కేవలం 2108 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని, మిగతా 2900 మందికి కూడా లబ్ధి చేకూరే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. అదేవిధంగా గత సంవత్సర కాలంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని, గతంలో జిల్లాలో సుమారు 1,300 మంది డ్రైవర్లు, క్లీనర్లు, ఆయమ్మలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని, మౌన దీక్ష చేశానని, ర్యాలీలు ధర్నాలు చేసి ప్రభుత్వం  ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే సిబ్బందికి ఆర్థిక సహాయం చేసేలా ట్రస్మా జిల్లా సంఘం కృషి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా  జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి సురభి శరత్ కుమార్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గోపతి సత్తయ్య,  పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.