వలస కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి ** జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం

Published: Saturday February 04, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 3 (ప్రజాపాలన ప్రతినిధి) :జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చి జీవనోపాధి పొందుతున్న వలస కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్మిక శాఖ, పరిశ్రమల శాఖ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులతో వలస కార్మికుల సంక్షేమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి వలస కార్మికుని వివరాలు ఈ - శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని వివిధ పరిశ్రమలలో వివిధ రాష్ట్రాల నుండి వలస వచ్చిన కూలీలు పనిచేస్తున్నారని, వారి వివరాలను సేకరించి ఈ - శ్రమ్ పోర్టల్ లో నమోదు చేయాలని, వలస కూలీల పిల్లల సంక్షేమం కోసం కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఇతర అసంఘటిత రంగాలకు చెందిన కూలీలు వారి వివరాలను ఈ - శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.