గిరి వికాసం పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి వరుణ్ రెడ్డి

Published: Friday July 22, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై21(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో గిరి వికాసం పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి అర్హులందరికీ అందించే విధంగా జరుగుతుందని సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరములో జిల్లా అదనపు కలెక్టర్ జోహార్ చాహత్ బాజ్ పాయి తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ  గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గిరిజన రైతులకు వ్యవసాయ సాగుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, బోరు బావులకు ఎస్ హెచ్ పి మోటార్లు, వ్యవసాయ  బావులకు పంపుసెట్లు, వైల్డ్ లైఫ్ గ్రామాలలో సోలార్ పంపు సెట్లు, కల్పించడంతోపాటు గిరి వికాసం పథకం కింద  అర్హులైన వారికి నూతన బ్లాకులను పూర్తి చేయాలని తెలిపారు. భగీరథ పథకం కింద ప్రతి  ఇంటికి తాగునీరు అందేలా చూడాలన్నారు. వరదలకు దెబ్బతిన్న పైపులైన్ల కు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, గర్భిణీలు, బాలింతలు,పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తెలిపారు. మన ఊరు - మన బడి, కార్యక్రమములో మొదటి విడతగా ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, సంక్షేమ అధికారి, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ, అధికారులు  తదితరులు పాల్గొన్నారు.