జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి : డివైఎఫ్ఐ

Published: Thursday August 05, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే జాబ్ క్యాలెండర్ ను వెంటనే ప్రకటించాలని డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు వడ్డేమాను మధు, ద్యానబోయిన యాదగిరి లు డిమాండ్ చేశారు. బుధవారం డివైఎఫ్ఐ జిల్లా కమిటీ పిలుపు మేరకు జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా మండలంలో అరూర్ చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధు, యాదగిరి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అమలుకు నోచుకోలేదని ప్రతి ఎన్నికల్లో నిరుద్యోగాన్ని తగ్గిస్తామని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటనలు చేసి ఎన్నికలు ముగిసిన తర్వాత నిరుద్యోగులను విస్మరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కేరళ తమిళనాడు తరహాలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల నాయకులు ఈర్ల నవీన్, వేముల జ్యోతిబసు, బొడ్డుశివ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.