తల్లాడలో వైఎస్ఆర్ విగ్రహాన్ని పట్టించుకోని నాయకులు..?

Published: Saturday December 11, 2021
మూడు నెలలైనా అలానే ఉన్నా మహానేత విగ్రహం..
అసహనం వ్యక్తం చేస్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు.. 
తల్లాడ, డిసెంబర్ 10 (ప్రజాపాలన న్యూస్) : దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రాజశేఖర్ రెడ్డి మరణాంతరం అప్పట్లో ఆయన విగ్రహాన్ని తల్లాడలోని రింగ్ రోడ్డు సెంటర్లో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని అప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇటీవల 3 నెలల క్రితం ప్రధాన రహదారిపై వెళుతున్న ఓ లారీ ప్రమాదవశాత్తు వైఎస్ఆర్ విగ్రహం ఉన్న దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వైయస్సార్ విగ్రహం ఉన్న దిమ్మె పూర్తిగా ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు నంబూరి శ్రీనివాసరావు ఆ విగ్రహాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలను ఆరా తీశారు. అంతేకాకుండా తల్లాడలో స్థానికంగా ఉన్న రెడ్డి సంఘం నాయకులతో మాట్లాడి ఆ దిమ్మెను పునర్నిర్మాణం చేసే విధంగా మంతనాలు జరిపారు. అంతేకాకుండా మీడియా సమక్షంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని గతంలో ఎలా ఉందో అలాగే తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కానీ మూడు నెలలైనా ఇప్పటివరకు ఆ విగ్రహాన్ని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఆ పార్టీ జిల్లా నాయకులు నుండి నంబూరి శ్రీనివాసరావు కినుక వహించారో.. ఏమో తెలియదు కానీ ఇప్పటివరకు ఆ దిమ్మెకు మరమ్మతులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. అదేవిధంగా తల్లాడలో రెడ్డి సంఘం నాయకులు, అభిమానులు ఉన్నప్పటికీ ఆ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేపట్టాలంటే షర్మిలమ్మ పార్టీ నాయకులు ఉన్నారు కదా అన్న ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జిల్లాలో అనేక మంది అభిమానులు ఉన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిన నాయకులు, ఇప్పటివరకు కూడా చేపట్టకపోవడంతో వైఎస్సార్ అభిమానులు పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల గుండెల్లో మంచి ఆదరణ ఉన్న నాయకుడిగా పేరొందిన వైఎస్సార్ విగ్రహాన్ని అలా వదిలేయడంపై పలు విమర్శలకు తావిస్తోంది. వైయస్సార్ తెలంగాణ పార్టీతో అనేక పదవులు పొందిన నాయకులు జిల్లాలో ఉన్నప్పటికీ తల్లాడలో వైఎస్ఆర్ విగ్రహం ఇలా శిథిలావస్థలో ఉండటంపై పలు రాజకీయ విమర్శలకు తావిస్తోంది. ఆ మహానేత పేరుతో పార్టీ పదవులను అనుభవిస్తున్న నాయకులు కనీసం ఆయన విగ్రహాన్ని పట్టించుకోకపోవడంపై రాజకీయ మేధావులకే చర్చాంశనీయంగా మారింది. ఇప్పటికైనా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఆలోచించి ఆ విగ్రహానికి పునర్ నిర్మాణం చేపట్టాలని వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ టీపీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.