రాజుల సొమ్ము రాళ్ళ పాలుప్రారంభం కాకుండానే శిథిలావస్థకు చేరిన భవనాలు

Published: Tuesday October 18, 2022

మధిర రూరల్ అక్టోబర్ 17 (ప్రజా పాలన ప్రతినిధి) మండలంలో పలు గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రజా ధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ప్రారంభం కాకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో రాజుల సొమ్ము రాళ్ల పాలు అనే సామెతకు అతికినట్లుగా అధికారుల వ్యవహార శైలి ఉంది. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాలకు ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించటంతో పాటు ప్రభుత్వం పక్కా భవనాలు సైతం నిర్మించారు. ఆ భవనాల్లో ఏఎన్ఎంలు స్థానికంగా నివాసం ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉంది. అయితే విచిత్రం ఏమిటంటే ప్రభుత్వం భవనాలు నిర్మించారు.వైద్య సిబ్బందిని నియమించారు. కానీ నిర్మించిన భవనాలు మాత్రం ప్రారంభించలేదు. దీంతో ఆ భవనాలు ప్రారంభించ కుండానే శిధిలావస్థకు చేరుకున్నాయి. మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో 10 సంవత్సరాల క్రితం  ఐదు లక్షల రూపాయలతో ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని నిర్మించి ప్రారంభం చేయకుండానే శిథిలావస్థకు చేరింది. భవనానికి ఏర్పాటుచేసిన కిటికీలు తలుపులు ధ్వంసమయ్యాయి లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనం అనేక సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోలేదు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ భవనం ప్రారంభోత్సవానికి నోచుకోకుండా శిథిలావస్థకు చేరాయని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అయినట్లు ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం అవుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో మడుపల్లికి చెందిన పలువురు డిఎం హెచ్ఓని కలిసి సబ్ సెంటర్ ను ప్రారంభించాలని కోరడం కూడా జరిగింది. అయినా కూడా అధికారుల నుండి స్పందన లభించలేదు. పాలకులు వెంటనే స్పందించి నూతన భవనాన్ని ప్రారంభించి ప్రజలకు వినియోగంలోకి తేవాలని, ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.