ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించిన మలబార్ గోల్డ్

Published: Thursday July 08, 2021
అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రముఖ ఆభరణాల రిటైల్ వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ & డైమండ్ తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం 5000 పైగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు సోమాజిగూడ స్టోర్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్టోర్ హెడ్ షెరీజ్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా మాలబార్ గోల్డ్ బ్రాండ్స్, రిటైల్ ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు ఈ నియమకాలు ఉపయోగ పడుతాయని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని అన్నారు. ఈ నేపథ్యంలో మలబార్ గోల్డ్ ఉద్యోగ నియామక ప్రక్రియ నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రతిభావంతులు, నైపుణ్యం గల వ్యక్తులు మలబార్ గోల్డ్ లో భాగస్వామ్యం కావాలని అని కోరారు.