వర్ణ వివక్షను రూపుమాపడం కొరకు అహర్నిశలు కృషి

Published: Tuesday April 12, 2022
జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్
వికారాబాద్ బ్యూరో 11 ఏప్రిల్ ప్రజాపాలన : వర్ణ వివక్షను రూపుమాపడం కొరకు జ్యోతిబాపూలే అహర్నిశలు కృషి చేశారని జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ కొనియాడారు. సోమవారం మహాత్మా జ్యోతిబా పూలే 196వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిబా పూలే అని పేర్కొన్నారు. ఆయన దేశానికి ఎన్నో సేవలు అందించారని, వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని తెలిపారు. కుల, లింగ వివక్షకు తావు లేకుండ విద్య, సమానత్వం ద్వారానే సామాజిక, ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయనే మహాత్మాపూలే ఆలోచన విధానాన్ని అందరు స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఆయన సహచరి సావిత్రి బాయి పూలేకు గురువుగా మారి ఉన్నత విద్యా వంతురాలిగా తీర్చిదిద్ది, ఎంతో మంది మహిళలకు సావిత్రి బాయిచే విద్య నేర్పించారని, చరిత్రలో సావిత్రి బాయి మొట్టమొదటి  మహిళా ఉపాద్యాయురాలిగా నిలిచి పోయారని తెలిపారు.