ప్రజలను దగా చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ** అధికార బలంతో విర్రవీగితే గుణపాఠం తప్పదు *

Published: Thursday August 18, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు17 (ప్రజాపాలన, ప్రతినిధి ) : కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం మోసపూరిత మాయ మాటలతో ప్రజలను దగాచేస్తు, మోసం చేస్తున్నారని, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళావేన శంకర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తిరుమల లాడ్జిలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా ద్వితీయ మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా  శంకర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలతో అనేక ఎన్నికల్లో వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ రంగానికి కలంకం తెచ్చే విధంగా మోడీ, కెసిఆర్ ప్రభుత్వాలు రాజకీయ ఆకర్స్ లతో సంతలో బేరం పెట్టినట్లు ప్రజా ప్రతినిధులను అంగడి పలుకులుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాట్లు దోబూచులాట ఆడుతూ అంతరంగికంగా బిజెపి ప్రభుత్వానికి లోపల మద్దతు ఇస్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర లలో ఆర్టీసీ, కరెంటు, రైలు చార్జీలతో పాటు ప్రజల నిత్యవసర వస్తువులైన వంట గ్యాస్ నూనె పెట్రోల్ డీజిల్ ధరలను 200 శాతం పెంచి చివరకు పాలపై, కూడా బడుగు బలహీన సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని అన్నారు. పాలకులు ధనబలంతో విర్రవీగి తే రాబోయే రోజులలో ప్రజా పోరాటాల తో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బద్రి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి తిరుపతి, సభ్యులు  గోపీనాథ్, జాడి గణేష్, పిడుగు శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి, రవీందర్, మహిళా నాయకురాలు పంచ పులా, లక్ష్మి, వివిధ మండలాల సిపిఐ ప్రతినిధులు పాల్గొన్నారు.