ఓటరు జాబితాలో తొలగించిన పేర్లను మరోమారు పరిశీలించాలి

Published: Thursday April 13, 2023
* వికారాబాద్ బ్యూరో 12 ఏప్రిల్ ప్రజాపాలన : ఓటరు జాబితాలో తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి ధృవీకరించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పొరపాట్లు లేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో బూత్ స్థాయి అధికారులుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి, రవి కిరణ్ తో కలిసి ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, బూత్ స్థాయి అధికారుల నియామకం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్  టెలికాన్ఫరెన్స్  నిర్వహించి మాట్లాడుతూ, ప్రతి పోలింగ్ బూత్ లో తప్పనిసరిగా గ్రామ కార్యదర్శులను  బి ఎల్ ఓ గా నియమించాలని సూచించారు.  ఓటరు జాబితా నుండి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించి ధ్రువీకరించుకోవాలని, అలాగే 100 సంవత్సరాలు దాటిన వారి వివరాలను కూడా పరిశీలించుకొని చనిపోయిన వారిని ఓటర్ జాబితా నుండి తొలగించాలని సూచించారు.  డబుల్ ఎంట్రీ ఉన్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించుకుని వారి పేర్లు తొలగించాలని అన్నారు.  ఓటరు జాబితా నుండి పేరును తొలగించే ముందు క్షుణ్ణంగా పరిశీలించుకొని స్పష్టమైన కారణం తెలుపుతూ తొలగించాలని అన్నారు. ఇట్టి పనులన్నీ వారం రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు ప్రతివారం స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, వికారాబాద్ ఆర్డిఓ విజయ కుమారి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, అన్ని మండలాల తాసిల్దారులు పాల్గొన్నారు.