ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలి : అఖిలపక్ష నాయకుల డిమాండ్

Published: Friday October 08, 2021
బెల్లంపల్లి, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇటీవల అఖిలపక్ష నాయకులపై చేసిన నిరాధారమైన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిలపక్షం డిమాండ్ చేశారు.  గురువారం అఖిలపక్ష నాయకులు రేగుంట చంద్రశేఖర్, గెల్లీ జయరామ్, గుండా మాణిక్యం, కాశీ సతీష్, ఎండీ. గౌస్, అమానుల్లా ఖాన్ స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మండిపడ్డారు. ఒకవేళ అఖిలపక్ష నాయకుల పై చేసిన ఆరోపణలను నిరూపించ నట్లయితే కాంటా బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకేసి రాస్తామని, లేని ఎడల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తామని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన బినామీలను అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరుతో బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ, సింగరేణి భూములను ఆక్రమిస్తూ కబ్జాలకు పాల్పడుతూ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ధ్వజ మెత్తారు.. పట్టణ ప్రజలకు కనీస పారిశుద్ధ్య త్రాగు నీటిని అందించకపోవడం సిగ్గుచేటని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడాలని ఒకవైపు హైకోర్టు మొట్టికాయలు వేస్తూ ఉండగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతూ జేఏసీ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పడం విడ్డూరంగ ఉందని అన్నారు. పట్టణంలోని టకారియానగర్ మరియు ఎల్లమ్మ గుడి, కన్నాల బస్తిలలో అక్రమాలకు గురైన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీన పరచుకునే వరకు తమ పోరాటం ఆగదని ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అఖిలపక్ష నాయకుల పై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.