పచ్చందాల హరివిల్లు కెరెల్లి ప్రకృతి వనం

Published: Tuesday December 13, 2022
 సుమారు 6వేల మొక్కలతో వర్ణశోభితం
* కనువిందు చేస్తున్న పల్లె ప్రకృతి వనం
* అందంగా తీర్చిదిద్దిన సర్పంచ్ నర్సింహారెడ్డి
వికారాబాద్ బ్యూరో 12 డిసెంబర్ ప్రజాపాలన : పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనాలు పచ్చందాల హరివిల్లును తలపిస్తున్నాయి. ఆకుపచ్చని హరితహారంతో పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నాయి. పర్యాటకుల మనస్సు రంజింపజేసే చల్లని వాతావరణంలో మనో వికాసానికి నాంది. అందమైన రంగురంగుల పూల మొక్కలు, పూల మొక్కలు, ఔషధ మొక్కలతో విరాజిల్లుతున్న పల్లె ప్రకృతి వనం. ధారూర్ మండల పరిధిలోని కెరెల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం ప్రకృతి శోభను సంతరించుకుంది. కెరెల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి నర్సింహారెడ్డి కృషి అనిర్వచనీయం. సుమారు 6 వేల మొక్కలతో పల్లె ప్రకృతి వనం పచ్చందాలతో ఆహ్లాదాన్నిస్తుంది. స్వచ్ఛమైన ఆక్సీజన్ గాలి పర్యాటకులను కట్టిపడేస్తుంది. ప్రశాంత వాతావరణంలో పిన్నలు పెద్దలు సేద తీరడానికి చక్కటి ప్రాంతం. ప్రకృతి వనం చుట్టూ కాలినడక చేయుటకు అనువైన కాలిబాట. కాలిబాటకు ఇరువైపుల రంగురంగుల రాళ్ళ అమరికతో కన్నులకు ఇంపుగా ఉంటుంది. చూసి తరించాలంటే ధారూర్ మండలంలోని కెరెల్లి గ్రామానికి వెళ్ళి తీరాల్సిందే. అనంతగిరి ప్రకృతి అందాలతో పాటు కెరెల్లి పల్లె ప్రకృతి అందాలను చూచి తరించాల్సిందే.