నేడేసూఫీ ధృవతార.హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా వారిఉరుసు ఉత్సవ్- మధిర నవంబర్ 8 ప్రజా

Published: Wednesday November 09, 2022
నిరుపేదల అక్షయ పాత్ర..హజరత్ ఖాదర్ వలీ బాబా ప్రియ శిష్యులు..హజరత్ మహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా వారి చారిత్రాత్మక తొట్ట తొలి ఉరుసు ఉత్సవ్-2022 నేటి నుంచి అనగా మంగళ, బుధ, గురు వారాల్లో మూడు రోజుల పాటు కృష్ణా జిల్లా చీమలపాడులో జరగనున్నాయి." ఈ మేరకు ఆధ్యాత్మిక చక్రవర్తి హజరత్ అతావుల్లా బాబా వారి సూఫీ వారసులు చీమల పాడు దర్గా దర్బార్ పీఠాధిపతి పీర్జదా మహమ్మద్ ఖ్వాజా మోహియుద్దీన్ షా తాజా ఖాదరీ, విజయనగరం హజరత్ ఖాదర్ వలీ బాబా దర్గా-దర్బార్ షరీఫ్ ముతవల్లి(ధర్మకర్త) డాక్టర్ ఎండీ ఖలీలుల్లా షా తాజ్ ఖాదరీ సాబరీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అఖిల భారత అన్నదాన చరిత్రలో తనదైన అవకాశాన్ని సృష్టించుకుని లక్షలాది మంది మానవీయుల్లో మానవత్వపు విలువలను పెంపొందించిన ఆధ్యాత్మిక చక్రవర్తి అతావుల్లా బాబా. లక్షల మందిని
 తన శిష్యులుగా తీర్చిదిద్ది 'సూఫీ సూరీడు'గా చరిత్ర గాంచిన బాబా హజరత్ ఖ్వాజా మహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ అవులియా ర.ఆ. వారు గత ఏడాది నిండు కార్తీక పౌర్ణమి రోజున ఇహ లోక మజిలీ ముగించుకుని దైవ చెంతకు శాశ్వతంగా తరలి వెళ్లినారు. ఆ మహనీయుని పరమ పావన లోక ప్రయాణం జరిగి ఏక వార్షికం పూర్తయిన శుభ సందర్భంగా నేటి నుంచి అనగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ప్రధమ పావన సూఫీ సుగంధ 'ఉరుసు మహోత్సవం' ను నిర్వహిస్తున్నట్టు ఆయన వారసులు తెలిపారు. దేశ విదేశాల నుంచి, భారత దేశ నలుమూలల నుంచి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చే వేలాది మంది భక్తుల కోసం చీమల పాడు అతావుల్లా బాబా దర్గా దర్బార్ లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఒక సజీవ ఇతి హాసంలా ఆరున్నర దశాబ్దాల కాలం(65 ఏళ్ళు) నిర్విరామంగా, నిరంతరాయంగా కోట్లాది మంది మానవాళికి అద్భుతమైన దివ్యన్న ప్రసాదాన్ని సమకూరుస్తూ, అక్షయ పాత్రలో అమృతం లాంటి ఆహారాన్ని జీవ నదిలా ప్రవహింప చేసే పుణ్య క్షేత్రాలుగా విజయనగరం, చీమల పాడు దర్గాలను తీర్చిదిద్ది, తన గురువు ఖాదర్ వలీ లా అందరిచే 'బాబా'(తండ్రీ) అని పిలుపును అందుకున్న మహా మానవీయుడు, దైవ స్వరూపానికి ప్రతి రూపం హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా వారని ఆయన వారసులు వివరించారు. కాగా కేవలం అన్న సమారాధనకే బాబా వారి సేవలు పరిమితం కాలేదు. అనారోగ్యంతో బాధ పడే వారినెందరికో తన చేతి స్పర్శతో స్వస్థత కల్పించారు. నిరుపేదలకి అను నిత్యం వస్త్రాలు అందించారు. అనాధులకి ఆపద్బాంధవుడిగా వృద్దాశ్రమాలు ఏర్పాటు చేయించారు. గూడు లేని వారికి సాయం అందించి గృహస్తులను చేశారు. ఎందరో నిరుపేద విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దారు. వేలమంది నిరుపేద ఆడపిల్లలకు తానే పెద్ద దిక్కుగా నిలబడి వివాహాలు జరిపించారు. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారిని తన ప్రార్థనల ద్వారా ఆరోగ్యవంతులను చేశారు. కుటుంబ సమస్యలతో మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడుదామనుకునే  ఎందరినో మానసిక పరిపూర్ణులను చేశారు. కుటుంబం విలువలకు నీళ్లొదిలి, స్వార్థంతో తల్లిదండ్రులను అనాధులుగా విడిచి పెట్టిన వారిలో మార్పు తెచ్చారు. ఎంత చదివారో, ఎప్పుడు చదివారో, ఎలా చదివారో తెలియదు గానీ, ఎన్నో వేదాలను ఔపోసనం పట్టిన వార్కి కూడా అంతుబట్టని ఎన్నో తాత్విక విషయాలు భోదిస్తూ లక్షలాది మందిలో మానవీయ, ఆధ్యాత్మిక, సామాజిక విలువలను పెంపొందించారు. సుమారు  వందల శతాబ్దాలు క్రితం గురు-శిష్య పరంపరగా పునాది వేసుకున్న 'సూఫీ' సిద్ధాంతం నేటి ఆధునిక తరంకి అర్థమయ్యేలా  అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా విశ్వ వ్యాప్తం గావించారు. తన గురువు హజరత్ ఖాదర్ వలి బాబా అవులియా ర.ఆ. వారికి తన దేహమే ఆలయంగా, తన హృదయమే నివాసంగా అర్పించి, ఆయన చూపిన మార్గంనే అనుసరిస్తూ అతావుల్లా బాబా తన జీవన మజిలీ లో డాగైనను, కళంకమైనను లేకుండా శాశ్వత దివ్య సన్నిధికి చేరుకుని, నేటికీ ఆయనను స్మరించుకునే వారికి తన అదృశ్య దైవ హస్తాన్ని అందిస్తూ తమ కష్టాలను తీర్చుతున్నారని ఆయన భక్తుల ప్రగాఢ విశ్వాసం. హజరత్ అతావుల్లా తాజ్ ఖాదరీ బాబా సూఫీయిజానికి 'సౌత్ ఇండియా చక్రవర్తి' అని భక్తులు వేనోళ్లు కొనియాడాతూ ఉంటారు. ఎందరో ప్రజా ప్రతినిధులు, పాలకులు, అధికారులు,
ఉద్యోగులు, సామాజిక వేత్తలు, యువకులు అతావుల్లా బాబా వారికి శిష్యులుగా ఉంటూ  ఆయన్ని ఆరాధిస్తూ, "సూఫీ మార్గం-సామాజిక సన్మార్గం" గా విశ్వసిస్తూ ఆచరించడం వెనుక గురు పరంపరను అత్యంత పవిత్రంగా నడిపించిన ఆయన అకుంఠిత దీక్ష(తపస్సు) దాగి ఉందని భక్తుల ఉవాచ. అందుకే అలుపెరుగని అన్నదాత గా, ఆధ్యాత్మిక చక్రవర్తి గా చరిత్ర గాంచిన అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదర్ బాబా వారి ఆశీస్సులు ప్రతీ ఒక్కరిపై ఉండాలని, ఆయన కరుణా కిరణాలు ప్రతీ ఒక్కరిపై ప్రసురణ కావాలని ఆశిస్తూ ఈ మూడు రోజులు జరిగే ఉరుసు మహోత్సవాల్లో పాల్గోవాలని కోరుతూ వారి వారసులు, కుమారులు జాఫర్ బాబు, ఖ్వాజా బాబు, ఖళీల్ బాబు, ఖాదర్ బాబు, సోదరి బుగ్ధాది ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.