చెట్లను నరికి ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్న విద్యుత్ అధికారులు విద్యుత్ అంతరాయం పేరుతో

Published: Thursday September 15, 2022

బోనకల్, సెప్టెంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి: ప్రకృతిని పచ్చగా ఉండాలనుకోవడం ప్రభుత్వ లక్ష్యం అయితే వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అనడం ప్రజల లక్ష్యం, మొక్కలు నాటి పెంచి పర్యావరణాన్ని సంరక్షించండి అంటున్న ప్రభుత్వ లక్ష్యం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన బుగ్గి పాలవుతోంది. విద్యుత్,ఆర్ అండ్ బీ అధికారుల సమన్వయ లోపం కారణంగా వేలాది చెట్లు మధ్యలోనే మోడుగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు,పట్టణాల్లో,రోడ్ల వెంట పచ్చని చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షించాలని హరితహారంలో భాగంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, దీనికి భిన్నంగా విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతోందని నాటిన చెట్లను విద్యుత్ శాఖ అధికారులు ఎవరి అనుమతి లేకుండా నరికివేస్తున్నారు. ఎన్ని చెట్లను నరికిన విద్యుత్ అంతరాయం మాత్రం ప్రజలకు శాపంగా మారింది. విద్యుత్ సమస్యల పేరు మీద వృక్షాలను నరుకుతున్నారే తప్ప విద్యుత్ సమస్య మాత్రం తీరడం లేదు. ఈ సంఘటన బోనకల్ మండల పరిధిలో రావినూతల గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పచ్చని చెట్లు నేలకొరిగాయి. చెట్లను నరకడమే కాకుండా నరికిన చెట్లను రహదారులకు అడ్డదిడ్డంగా పడేస్తున్నారు. నరికిన చెట్లు ఎవరు తీస్తారు అని అడగగా విద్యుత్ అధికారులు మాత్రం సమాధానం చెప్పటం లేదు. నరికిన చెట్లు సర్వీస్ వైర్ల మీద పడి ఇంటి మొత్తానికి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ సంఘటన రావినూతల గ్రామంలో చోటుచేసుకుంది. అదేవిధంగా రావినూతల గ్రామంలో పేదలకు అధిక విద్యుత్ బిల్లులు వస్తున్నాయి అని పేదలు విద్యుత్ అధికారులను అడగగా మీరు వెళ్లి కేసీఆర్ ని అడగండి అని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటండి, పర్యావరణాన్ని సంరక్షించండి అంటుంటే విద్యుత్ అధికారులు మాత్రం పెంచిన చెట్లను ఎవరి అనుమతి లేకుండా కరెంటు వైర్లకు అడ్డుగా వస్తున్నాయి అని నరికి వేస్తున్నారు. చెట్లను నరికివేయడం చట్ట వ్యతిరేకమైన చర్యగా భావించాలి. విద్యుత్ తీగల కింద నాటిన మొక్కలు ఎదిగిన కొన్నాళ్లకే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నరికివేతకు గురవుతున్నాయి. ప్రభుత్వ లక్షసాధనలో విద్యుత్ తీగల కింద మొక్కలు ప్రతి ఏటా హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన భాధ్యతను అధికారులకు, ప్రజాప్రతినిధులకు అప్పగించారు. దీంతో ఎలాగైనా లక్ష్యం మేరకు మొక్కలు నాటాలనే తాపత్రయంలో ఏమాత్రం ముందు చూపు లేకుండానే ఏకంగా విద్యుత్‌ వైర్లకిందే మొక్కలు నాటేస్తున్నారు. నాటిన మొక్కలు ఏడాదిలోపు విద్యుత్‌ వైర్లను తాకుతున్నాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు అంటున్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.