నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి

Published: Thursday January 20, 2022
సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు.
నస్పూర్, జనవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి): సింగరేణి లో పని చేస్తున్న కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఫిబ్రవరి 12నుండి చేపట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-5, సిఎస్పిలపై సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వలు కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన, చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాలు, కల్పించడంలో విఫలమైనాయని అన్నారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. నేడు సింగరేణిలో పర్మనెంట్ కార్మికులు 43 వేల మంది ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు 30 వేల మంది ఉన్నారని అన్నారు. తెలంగాణలో రాష్టం లో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి కనీస వేతనాలు లేక, పర్మినెంట్ ఉద్యోగాలు రాక, అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం  పర్మినెంటు ఉద్యోగాలను కొల్లగొట్టి కాంట్రాక్టు కార్మికులతో ఎలాంటి భద్రత లేకుండా అండర్ గ్రౌండ్ గనులతో పాటు అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులతో పని చేపిస్తున్నారని తెలిపారు. కాంటాక్ట్ కార్మికులకు పర్మినెంట్ కార్మికులతో సమానంగా హక్కులు, సౌకర్యాలు కల్పించాడంలో సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. పదో వేజ్ బోర్డు సర్కులర్ ప్రకారం వేతనలు కూడా కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం తక్షణమే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయమైన చట్టబద్ధమైన హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు దొడ్డిపట్ల. రవీందర్, తిరుపతి, ఐఎఫ్ టియు నాయకులు డి. బ్రహ్మానందం, బి.యాదగిరి, మేకల రామన్న, సారయ్య, సిఐటియు నాయకులు వేల్పుల కుమారి, కాంట్రాక్ట్ కార్మికులు శంకర్, లక్ష్మణ్, సదానందం, ఉషాలు, ప్రశాంత్, అరుణ్, సాగర్, మహేష్, కోమల, లక్ష్మి, రజిత, ఉమా పాల్గొన్నారు.