గొల్ల కురుమల మహిళల సమస్యలు పరిష్కారమే లక్ష్యం

Published: Monday November 14, 2022
 గొల్ల కురుమల మహిళా సంఘం అధ్యక్షురాలు చిటుకుల అనిత
వికారాబాద్ బ్యూరో 13 నవంబర్ ప్రజా పాలన : గొల్ల కురుమల మహిళల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని గొల్ల కురుమల మహిళా సంఘం అధ్యక్షురాలు చిటుకుల అనిత అన్నారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవారం పల్లిలో శివాలయం ప్రాంగణ సమీపంలో గొల్ల కురుమల మహిళల సమావేశాన్ని మొగ్దుపురం అనంతలక్ష్మి రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. గొల్ల కురుమల మహిళా సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చిటుకుల అనిత మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయపరంగా ఎదగాలని సూచించారు. పురుషులకు సమానంగా అన్ని రంగాలలో గొల్ల కురుమల మహిళలు రాణించాలని హితవు పలికారు. గొల్ల కురుమ మహిళలు తమ కుటుంబాన్ని చక్కబెట్టినట్టుగా నేటి సమాజాన్ని కూడా ఉద్ధరించేందుకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. మూడు జుట్లు కలిస్తే మహిళలు కీచులాడుకుంటారని నానుడిని రూపుమాపేందుకు గొల్ల కురుమ మహిళలు ఐక్యంగా పోరాడాలని స్పష్టం చేశారు. గొల్ల కురుమ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వము ద్వారా అందజేసే ప్రతి సంక్షేమ పథకాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. తమ సంతానాన్ని ఉన్నత చదువులు చదివించాలని కోరారు. చదువు ద్వారానే సామాజికంగా రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో గొల్ల కురుమల మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు ముంగి స్వప్న కార్యదర్శులు మధు, శ్రావణి కోశాధికారి రాయికోడ్ పద్మ తదితర మహిళలు పాల్గొన్నారు.