మాదకద్రవ్యాలు నుండి కాపాడాల్సిన బాధ్యత మనందరిదే.. : వైరా ఏసీపీ స్నేహమెహ్రా..

Published: Wednesday February 02, 2022
తల్లాడ, ఫిబ్రవరి 1 (ప్రజాపాలన న్యూస్): సమాజంలో నేటి బాలలే రేపటి పౌరులని, భావితరాలను మాదకద్రవ్యాల నుండి  కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైరా ఏసీపీ స్నేహమేరా అన్నారు. మంగళవారం తల్లాడ పోలీస్ స్టేషన్ లో ఎస్సై సురేష్ అధ్యక్షతన మాదకద్రవ్యాలపై ప్రజాప్రతినిధులకు, స్కూల్ యాజమాన్యాలకు, దుకాణదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత గుట్కా, పాన్ పరాగ్ లకు అలవాటుపడి వాటిద్వారా గంజాయి, డ్రగ్స్ లాంటి వాటికి బానిసలవుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయిని అరికట్టాలని సమాచారం వచ్చినట్లు తెలిపారు. వైరా సర్కిల్ పరిధిలో మాదక ద్రవ్యాల పై ఉక్కు పాదం మోపినట్లు వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువత, విద్యార్థులు తాత్కాలిక ఆనందాల వైపు మొగ్గు చూపుతూ వాటికి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందన్నారు.  యువకులు గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. కొంతమంది వైట్నర్ ద్వారా కూడా వాటికి గురవుతున్నారని, వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు గంజాయి, డ్రగ్స్ కేసులు లేవని, తల్లాడ మండలంను కూడా వీటినుండి కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అనంతరం వైరా సీఐ వసంత్ కుమార్, తల్లాడ ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అధిక డబ్బులకు ఆశపడి మాదకద్రవ్యాలు తరలింపు లాంటి కిరాయిలకు  వెళ్ళవద్దన్నారు. ఈ కేసులు ఇరుక్కుంటే జీవితాంతం నష్టపోవాల్సి వస్తుందన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాళ్ల నడవడికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఈఓ దామోదర్ ప్రసాద్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.