పంట దిగుబడులను మొబైల్ యాప్ ద్వారా నిర్వహించాలి

Published: Tuesday April 20, 2021
జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19 ప్రజాపాలన : రైతులు పండించిన పంట సేకరణ, క్వాంటిటీ, పంట వివరాలు లావాదేవీలు అన్ని ఇక నుండి మొబైల్ ఆప్ ద్వారా ఆన్ -లైన్ లో నిర్వహించాలని ఇందువల్ల పనులలో సౌలభ్యంతో పాటు సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలియజేశారు. సోమవారం మోమిన్ పేట మండల కేంద్రంలోని అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కంపెనీ వ్యవహారాలు అన్ని ఆన్ -లైన్ ద్వారా నిర్వహించేందుకు గాను సీసీ లు, ఏపిఓ లకు పవర్ ప్రెజెంటేషన్ నిర్వహించి అవగాహన కల్పించారు.  ఇక నుండి కంపెనీ లావాదేవీలు అన్ని ఫార్మర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించాలని రైతులకు సంబందించిన అన్ని వివరాలు పొందు పర్చాలని సూచించారు. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏ పంట వేశారు, ఎప్పుడు వేశారు, వేసిన పంట ఎప్పటి వరకు వస్తుంది, పండించిన పంట సేకరణ, మార్కెట్ తరలింపు, క్వాంటిటీ, అమ్మకాలు, ధరతో పాటు పంట తరలింపు వాహన వివరాలు అన్ని ఇందులో పొందు పర్చినట్లయితే పనులలో సౌలభ్యంతో సమయం ఆదా అవుతుందని, రిజిస్టర్లు నిర్వహించవలసిన అవసరం ఉండదని తెలిపారు. నవాబుపేట, మర్పల్లి మండలాల్లో రైతు గ్రూపులను ఏర్పాటు చేసేందుకు సీసీ లు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రూపులో 15 మంది సభ్యులు ఉండాలన్నారు.  ఇప్పటి వరకు నవాబుపేట లో 4 కొత్త గ్రూపులు ఏర్పాటు చేయగా, మార్పల్లిలో 2 గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  కొత్తగా గ్రూపులో చేరిన రైతులతో సమావేశం నిర్వహించి కంపెనీ విధి విధానాలు తెలియపర్చాలన్నారు. వారు పండించిన పంటలు కంపెనీకి అమ్ముకొనే విధంగా చూడాలన్నారు. మోమిన్ పేట, నవాబుపేట, మార్పల్లి రైతులందరు అనంతగిరి కంపెనీకి తమ పంటలు అమ్ముకొనేలా చూడాలన్నారు. రైతుల పండించిన పంటలను వారి పొలాల వద్ద నుండి సేకరించి మార్కెట్ కు తరలించడానికి ట్రాలీ ఆటోను వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. కంపెనీ అభివృద్ధికి అందరు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నందున కరోనా బారిన పడకుండ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. మాస్కులు, సామాజిక దూరంతో పాటు శానిటైజర్ వినియోగించి సురక్షితంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ కృష్ణన్,  నర్సిములు, డీపీఎం శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి గఫూర్, కంపెనీ చైర్మన్ లు లక్ష్మి, ప్రమీల, ఏపిఓ లు, సీసీ లు తదితరులు పాల్గొన్నారు.