కొవిడ్ వైద్య సేవల నిమిత్తం ఐసోలేషన్ కిట్స్ అందజేయడం అభినందనీయం.

Published: Thursday May 20, 2021

జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి
మంచిర్యల, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లాలో కొవిడ్ వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందించడంలో భాగంగా వినియోగించే పల్స్ ఆక్సిమీటర్లు, హోమ్ ఐసోలేషన్ కిట్లు, రాపిడ్ కిట్లు మంచిర్యాల శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు పిలుపుమేరకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం ఆవరణలో మంచిర్యాల శాసనసభ్యులతో కలిసి నస్పూర్, రాజీవ్ నగర్, పాత మంచిర్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొవిడ్ నియంత్రణ, రోగులకు వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని, దీనికి తోడుగా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శాసన సభ్యులు మాట్లాడుతూ 12 లక్షల 85 వేల రూపాయల విలువ గల 3500 హోమ్ ఐసోలేషన్ కిట్లు, 700 ఆక్సి మీటర్లు, 2500 రాపిడ్ కిట్లు అందించడం జరిగిందని, సరైన వైద్య సేవలు, మందులు అందక ఎవరూ చనిపోకూడదని, జిల్లా ప్రజల సౌకర్యార్థం దాతలను అడగగా ముందుకు వచ్చారని తెలిపారు. కరోనా నియంత్రణ దిశగా ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టిందని, ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశలు, అంగన్వాడీలు ఇంటింటి సర్వే చేసినప్పుడు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని, పాజిటివ్ వచ్చినవారికి సరైన సమయంలో వైద్య సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ పెంట రాజయ్య, రైస్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షులు నలుమాస్ కాంతయ్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, సంబంధిత అధికారులు, నాయకులు, పలువురు  దాతలు తదితరులు పాల్గొన్నారు.