జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

Published: Thursday September 23, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 22 (ప్రజాపాలన) : జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం అసెంబ్లీలో చర్చించాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుర్వ శ్రీనివాస్, జగ జంపుల తిరుపతి లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోనే గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, ఈ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కూడా లేకపోవడం బాధాకరం అన్నారు. 4 సంవత్సరాల క్రితం జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ కి సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు అక్కడ జరిగిన సభలో కొమురం భీం సాక్షిగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఉట్నూర్ లో స్థలం కూడా సర్వే చేసి కేటాయించారని, అక్కడ కేటాయించిన తర్వాత ఇచ్చిన హామీని మరిచి ములుగు జిల్లాకు యూనివర్సిటీని తరలించడం పట్ల, ఇక్కడి గిరిజన విద్యార్థులకు తీరని అన్యాయాన్ని మిగిల్చారని అన్నారు. ఇక్కడ గిరిజన యూనివర్సిటీ లేకపోవడంతో ఆదివాసీలు, గిరిజనులు ఇంటర్ డిగ్రీ లతోనే మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఈ నెల సెప్టెంబర్ 24న జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసే విధంగా అసెంబ్లీలో గళం వినిపించి గిరిజన యూనివర్సిటీ కేటాయించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలతో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పిడిఎస్యు జిల్లా నాయకులు రమేష్, దినేష్ లు పాల్గొన్నారు.