అధికారపార్టీలో ఆగమ్యగోచరంగా ద్వితీయశ్రేణి నాయకులు ?

Published: Tuesday May 25, 2021
ప్రతీపని మంత్రి చేతులమీదుగానే జరుగుతుండడంతో డమ్మీలవుతున్న ద్వితీయ శ్రేణి !!!
సిద్దిపేట (ప్రజాపాలన ప్రతినిధి ) : పక్కనే ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మున్సిపల్ మంత్రి తారకరామారావు ద్వితీయ శ్రేణి నాయకులకు ఇచ్చినంత స్వేచ్ఛ సిద్దిపేటలో ఆర్ధిక మంత్రి ఇవ్వట్లేదా అందుకే ఈ మధ్య టి ఆర్ ఎస్ నాయకుల గొంతులు సైతం అభివృద్ధి శూన్యం అని వినిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సిరిసిల్లలో ఎక్కువ శాతం పనులు ద్వితీయ శ్రేణి నాయకత్వం చేతుల మీదుగా జరిపించడం ద్వారా ఆ నాయకులను బలోపేతం చేయడం వారికి వారి వారి ప్రాంతాలలో పేరు ప్రతిష్టలు పెంచడం ద్వారా పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయగలమన్న ఆలోచన కె టి ఆర్ ది ఐతే సిద్దిపేటలో మాత్రం ప్రతీ పని మంత్రి చేతులమీదుగానే జరగడం ద్వారా ద్వితీయ శ్రేణి నాయకులు డమ్మీలుగా మిగిలిపోతున్నారనే వాదన సీనియర్ నాయకులలో ఏర్పడిందని, దీని పర్యవసానమే గత మున్సిపల్ ఎన్నికలలో సగానికి పైగా కొత్త వారికే అవకాశాలు దక్కాయా అన్న అనుమానం ప్రజలలో నెలకొంది. కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా సీనియర్ లకు చెక్ పెట్టారన్న వాదన బలంగా వినిపిస్తుంది. సిద్ధిపేట పట్టణంలో గత మున్సిపల్ చైర్మన్ తో కలుపుకుని ముగ్గురు నాయకులు, మంత్రికి బలమైన ఓటు బ్యాంక్ గా ఉన్న చిన్నకోడూరు, నంగునూరు మండలాలకు చెందిన నాయకులకే అధిక ప్రాధాన్యం ఉన్నదని, ఈ నలుగురైదుగురు నాయకులు తప్పితే మిగతావారు విపక్షాలు చేసే విమర్శలను కనీసం ఖండించట్లేదని ప్రజలు ముచ్చటించుకుంటున్నారు. ఐతే ఎంత అయిష్టంగా ఉన్నా సీనియర్లు, క్యాడర్ మాత్రం మంత్రికి వ్యతిరేకంగా గళం విప్పకపోవడం గమనార్హం. సొంత పార్టీలో వ్యతిరేక గళాలు వినిపించకముందే మంత్రి జాగ్రత్త పడతారో చూడాల్సిందే అనుకుంటున్నారు విశ్లేషకులు...