ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు ** జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ రావు **

Published: Monday February 13, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 12 (ప్రజాపాలన,ప్రతినిధి): జిల్లాలో నెలకొన్న ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ రావు అన్నారు. ఆదివారం జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామాన్ని సందర్శించి హైమన్ ధర్ప్ బెట్టి ఎలిజబెత్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం అధికారుల సమన్వయంతో కృషి చేస్తానని, ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు కృషి చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజల కోసం  అందిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా అర్హత గల వారిని ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కు మంజూరైన రెండు పడక గదుల ఇంటిని, గ్రామంలోని గుస్సాడీ కేంద్రాన్ని సందర్శించారు. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ సర్మెడ ప్రతిభ వెంకటేశ్వర్లు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు.
అనంతరం జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ గ్రామాన్ని సందర్శించి భీమ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా కృషి చేస్తానని, ఈ క్రమంలో త్వరలోనే అధికారులతో  సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమాలలో జైనూర్ ఆర్.ఐ.సుధాకర్, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ - ఉట్నూర్ ఏఈ. ఇంధల్, ఉపసర్పంచ్ ధర్మేందర్ సావిత్రి, క్షేత్ర సహాయకులు సుభాష్, పంచాయతీ కార్యదర్శి మనోజ్, కెరమెరి తహసిల్దార్ సాయన్న, గ్రామ సర్పంచ్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.