ఉద్యానవన శాఖ ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పనులు చేపట్టాలి.

Published: Thursday August 26, 2021
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల బ్యూరో, ఆగస్టు 25, ప్రజాపాలన : జిల్లాలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులు కార్యచరణ రూపొందించుకొని ప్రణాళిక బద్దంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, ఎన్.సి. కార్పొరేషన్, గిరిజన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకము భాగంగా చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని, రైతులకు తోటల కొరకు పెంపకంలో భాగంగా మామిడి, జామ, బొప్పాయి తోటలకు సంబంధించిన రైతులకు 40 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందని, 15 సం॥ల పైబడిన మామిడి తోటలకు పున రుద్ధరణ కొరకు ఎకరానికి 8 వేల రూపాయల రాయితీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ మల్చింగ్లో భాగంగా కూరగాయల తోటలకు ఎకరానికి 6 వేల 400 రూపాయలు రాయితీ ఇవ్వడం జరుగుతుందని, సాగులో యాంత్రీకరణలో భాగంగా చిన్న ట్రాక్టర్లు, బ్రెష్ కట్టర్లు, ట్రాక్టర్ ఆధారిత స్ప్రేలను రాయితీ క్రింద రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి శ్యామ్రావు రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, జిల్లా ఎన్.సి. కార్పొరేషన్ అధికారి హర్ నాథెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జనార్థన్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.