పందిరి వ్యవసాయంతో, అదనపు ఆదాయం. కృషి విజ్ఞాన కేంద్రం, కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్.

Published: Wednesday October 26, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి:  మంచిర్యాల, అసిఫాబాద్, కొమరం భీం జిల్లాల రైతులు మామూలు పంటలతో పాటు, పందిరి వ్యవసాయంపై పంటలు పండిస్తే అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని, బెల్లంపల్లి  కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్, రాజేశ్వర్ నాయక్ అన్నారు.
 
మంగళవారం  రైతులకు ప్రకటన విడుదల చేశారు,
మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జిల్లాలలో ఎంతోమంది రైతులు కష్టపడి పనిచేసే తత్వం కలవారు ఉన్నారని, అయినప్పటికీ రైతులు సాధించాల్సిన స్థాయిలో ఉత్పత్తిని సాధించలేక, సాధించిన ఉత్పత్తికి సరైన ధర పొందలేక నష్టపోతున్నారని అన్నారు. ముఖ్యంగా కూరగాయలు పండించే రైతులు మార్కెట్ ను సరిగా అధ్యయనం చేయక పోవడం వల్ల, కాలాల మీద సరైన అవగాహన లేకపోవడంతో భారీ గా నష్టపోతున్నారని అన్నారు.
పందిర్ల వ్యవసాయ పద్ధతిలో అతి తక్కువ ప్రదేశంలో ఎక్కువ పంటలను తీస్తూ ఎంతో అభివృద్ధిని సాధించవచ్చని, నేల విస్తీర్ణాన్ని పెంచలేని రైతు ఉన్నటువంటి కొద్దిపాటి భూమిలో వనరులని సక్రమంగా వినియోగించుకుంటూ పందిర్ల ( మల్టీ లేయర్) పద్ధతిలో కొన్ని పంటలను నేలమీద, మరికొన్ని తీగజాతి కూరగాయలను పందిర్ల మీద పాకేలా చేసుకుని,  ఒకే ప్రదేశంలో అధిక పంటలను పండిస్తూ అధిక దిగుబడులను పొందవచ్చని తెలిపారు. 
ఈ అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి వారు ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నారని రైతులు వినియోగించుకోవాలని అన్నారు.
మనకున్న భూమిని సమర్థవంతంగా వినియోగించుకోవడమే కాకుండా, పంటల సరళిని కూడా మార్కెట్లో ఉన్న రేట్లు ఆధారంగా రైతు మార్చుకున్నట్లు అయితే అధిక లాభాలు వస్తాయని,  
ముఖ్యమైన పండుగలు అయినా దసరా, దీపావళి వరకు కోతకు వచ్చేలా బంతిపూల పంటను వేసుకోవడం వల్ల మామూలు సమయాల్లో 30 నుండి 40 రూపాయలు ఉండే బంతిపూలు పండగ సమయాల్లో నాణ్యతను బట్టి 100 నుండి 150 రూపాయలు వరకు ధర ఉంటుందని, కూరగాయలను కూడా మార్కెట్లో తక్కువగా ఉండే సమయాలను గుర్తించి ఆ సమయాల్లో పంట దిగుబడి వచ్చే విధంగా వేసుకోవడం వల్ల  కాకర, బీర, సొరకాయ, వంటి వాటికి మార్కెట్లో మంచి ధర ఉండడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. 
 ఈ విధంగా రైతులు  పందిర్ల వ్యవసాయాన్ని చేస్తూ,  మరిన్ని అంశాలపై వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వ్యవసాయంలో వస్తున్న నూతన పద్ధతులపై అవగాహన పెంచుకొని  వ్యవసాయంలో ముందడుగు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.