నాణ్యమైన వరిధాన్యం కొనుగోలు చేయాలి

Published: Tuesday May 17, 2022
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
 
మంచిర్యాల బ్యూరో, మే16, ప్రజాపాలన :
 
ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి వడ్లు కొనుగోలు  చేయడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల వద్ద నుండి నాణ్యమైన వడ్లు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని దండేపల్లి, లింగాపూర్, నెల్కివెంకటాపూర్ కొనుగోలు కేంద్రాలతో పాటు హాజీపూర్, జన్నారం మండల కేంద్రాలలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు కల్లాల వద్దనే తప్ప, తాలు లేకుండా చూసుకొని నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావడంతో పాటు తేమ శాతాన్ని పరీక్షించుకోవాలని తెలిపారు. కేంద్రాల నిర్వాహకులు సైతం కొనుగోలు సమయంలో ధాన్యం నాణ్యతను పరిశీలించాలని, రైతులకు త్రాగునీరు, నీడ ఇతరత్రా మౌళిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.