మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావ

Published: Tuesday December 20, 2022

 బోనకల్, డిసెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని మిర్చి పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోనే గార్లపాడు గ్రామంలో తాతా లక్ష్మీనారాయణ కు చెందిన మిర్చి పంట దెబ్బతిన్న కారణంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో దెబ్బతిన్న పంటలకు ఆ ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించి రైతులను ఆదుకుంటుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించడం లేదని, దీని వలన రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా నల్లనల్లి, బొప్పరాగంతో మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. కానీ ప్రభుత్వ మాత్రం రైతులను ఆదుకునే ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఒక్కొక్క ఎకరానికి రైతులు లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారని, కానీ అందులో 20 శాతం కూడా పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. దీనివలన అప్పుచేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పులు పాలవుతున్నారని, అప్పులు పాలైన అన్నదాతలు అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తమ ప్రభుత్వం రైతుబంధు చెల్లించి రైతులను లక్షాధికారులు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుండగా మరోవైపు రైతులు వ్యవసాయం చేయలేక అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి మిర్చికి లక్ష నుంచి లక్షన్నర పెట్టుబడి అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే రైతులు పెట్టిన మిగిలిన పెట్టుబడి పరిస్థితి ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పదివేల రూపాయల వల్ల రైతులకు జరిగిన ఉపయోగం ఏమీ లేదన్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. కౌలు 20 నుంచి 25 వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారని, గతంలో రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించేవారని కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఎందుకు ఎత్తివేసిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోకపోతే తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులను సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు కొమ్మినేని నాగేశ్వరరావు ,రైతులు దొండపాటి నాగేశ్వరరావు, గుడిపూడి వెంకటేశ్వర్లు, గండు సైదులు, తాత వీరయ్య, ముక్కపాటి నాగేశ్వరరావు, తాత వెంకయ్య, తాతా గోపయ్య, కిలారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.