గ్రామీణ వైద్య సేవలు వినియోగించుకోవాలి

Published: Tuesday November 16, 2021
బోనకల్, నవంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి: గ్రామీణ వైద్య సేవలు ప్రభుత్వం వినియోగించుకోవాలని తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రుద్ర గాని ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామంలో గ్రామీణ వైద్యుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులు లో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు శ్రావణి గ్రామీణ వైద్యులకు పలు వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 428ను ఉపసంహరించుకొని, అర్హత ఉన్నా గ్రామీణ వైద్యుల సబ్ సెంటర్, పల్లె దవాఖాన లో నియమించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 45 వేల గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ సర్టిఫికెట్ అందజేస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి విస్మరించిదని అన్నారు .ప్రజలకు అందుబాటులో ఉండి పగలనక రాత్రనక ప్రథమ చికిత్స అందించడం గ్రామీణ వైద్యులకు సాధ్యమైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామీణ వైద్యులను ఆదుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొమ్మినేని కొండలరావు, బోయినపల్లి వెంకటేశ్వర్లు సంఘ నాయకులు షేక్ హుస్సేన్, మరీదు కిషోర్, షేక్ ఖాసీం, జేడీ మూర్తి, కొంగర గోపి దంత వైద్య నిపుణులు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.