గీత పని వాళ్ళ కోసం తుది శ్వాస వరకు పోరాడిన నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం

Published: Monday February 07, 2022
 సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 
బోనకల్, ఫిబ్రవరి 6 ప్రజా పాలన ప్రతినిధి: గీత పని వారుల కోసం బడుగు బలహీన అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్తగూడెం మాజీ శాసన సభ్యులు కునంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముష్టికుంట్ల గ్రామంలో ఆదివారం జరిగిన బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి వేడుకలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు వంగాల పెద్ద వెంకటేశ్వర్లు జండా ఆవిష్కరించగా, ధారగాని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. ఈ జయంతి వేడుకలలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, కౌన్సిల్ సభ్యులు బొమ్మగాని నాగభూషణం తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మగాని ధర్మభిక్షం ప్రజల కోసం గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపి హైదరాబాద్ రాష్ట్రంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారన్నారు. నల్లగొండలో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు సెల్ ఏర్పాటు చేసి యువకులను పోరు మార్గంవైపు నడిపాడని ఆయన కొనియాడారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన మొట్ట మొదటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుడిగా ఆయనకు కీర్తి ఉందన్నారు. 1952లో సూర్యాపేట నియోజకవర్గం నుండి 1957 లో నకిరేకల్ నియోజకవర్గం నుండి 1962 లో నల్లగొండ నియోజక వర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా, నల్లగొండ పార్లమెంట్ నుండి రెండు సార్లు ఎంపీగా ఆయన విజయం సాధించారని గుర్తు చేశారు. గీత పని వాళ్ల కోసం తన తుది శ్వాస వరకు పోరాడిన బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పెట్టడంతోపాటు ఆయన జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడమే ఆయనకు నిజమైన నివాళి అని, కనుక తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు తోడేటి కొమురయ్య, వంగాల పెద్ద వెంకటేశ్వర్లుతోపాటు బోనకల్ మండలం లోని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాల పదకొండు అధ్యక్షులు అందరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో గీతపని వారుల సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి దూసరి శ్రీరాములు గౌడ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, మాజీ ఎంపీపీ చిట్టిమోదు నాగేశ్వరరావు,సీపీఐ బోనకల్ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ బంధం శ్రీనివాసరావు, ధారగాని కృష్ణ, నాయకులు మరీదు హనుమంతరావు, కొనకళ్ల పిచ్చయ్య, బంధం వెంకన్న, ధారగని ఏడుకొండలు, ఆకెన పవన్ తదితరులు పాల్గొన్నారు.